అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్న ఏజెన్సీలు
కిచెన్ షెడ్లు, వంట గ్యాస్ లేక నిర్వాహకుల ఇబ్బందులు
నీళ్ల చారు, ఉడకని అన్నంతో విద్యార్థుల అర్ధాకలి
‘సాక్షి’ విజిట్‌లో పలు విషయాలు వెలుగులోకి..
జిల్లాలో 540 ప్రభుత్వ పాఠశాలలు..32,843 మంది విద్యార్థులు
నర్సంపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలో వంటలు తయారు చేయడం, మెనూ పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఉడకని అన్నం, నీళ్ల చారుతో విద్యార్థులు సరిగా భోజనం చేయక అర్ధాకలితో అలమటిస్తున్నారు. దీంతో సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులు తమ ఇళ్ల నుంచే బాక్సుల్లో భోజనాన్ని తెచ్చుకొని తింటున్నారు.
ఇటీవల విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ సత్య శారద, జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిబంధనలు పాటించని ఏజెన్సీ నిర్వాహకులను తొలగించాలని అధికారులను ఆదేశించినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మధ్యాహ్నం భోజనం పథకం ఎలా అమలవుతుందో తెలుసుకునేందుకు ‘సాక్షి’ బుధవారం పలు పాఠశాలలను సందర్శించింది. వంటలు వండే పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలను వడ్డించకపోవడం పలు పాఠశాలల్లో కనిపించింది. అదేవిధంగా ఎక్కువ పాఠశాలల్లో వంట గ్యాస్‌కు బదులు కట్టెల పొయ్యిని ఉపయోగించారు. జిల్లాలోని 540 ప్రభుత్వ పాఠశాలల్లో 32,843 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది.
● నర్సంపేట మండలంలోని ఓ పాఠశాలలో మెనూ ప్రకారం గుడ్లు అందించాల్సి ఉంది. కానీ, 14 మంది విద్యార్థులకు అందించ లేదు. పప్పుచారు అంటున్నారు.. పప్పు కనిపించడం లేదు, పచ్చి పులుసు అంటున్నారు.. చింత పండు వేయడం లేదు అంటూ విద్యార్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారంటే పాఠశాలల్లో ప్రభుత్వం సూచించిన మెనూ పాటించడం లేదనడానికి ఇది నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యంగా మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోందని స్పష్టమవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ ఇలా..
సోమవారం: కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ
మంగళవారం: అన్నం, సాంబార్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ
బుధవారం: అన్నం, ఆకుకూరలు, కూరగాయలు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు
గురువారం: వెజిటబుల్ బిర్యానీ, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ
శుక్రవారం: అన్నం సాంబార్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు
శనివారం: అన్నం, ఆకుకూరలు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ
Comments
Please login to add a commentAdd a comment