ఆంధ్రా మైసూర్‌గా నూజివీడు
నూజివీడు: ఆంధ్రా మైసూర్‌గా పేర్గాంచిన నూజివీడులో దసరా సంబరాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పట్టణంలోని పురాతన ఆలయం శ్రీ కోట మహిషాసురమర్దని అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి 68వ శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుద్ధీపాలతో అలంకరించారు. పట్టణంలో ఇటు పొట్టిశ్రీరాములు బొమ్మ సెంటర్ వరకు, అటు పెద్దగాంధీబొమ్మ సెంటర్ వరకు రహదారికి ఇరువైపులా విద్యుద్దీపాలను అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు తొలిరోజు బాలా త్రిపుర సుందరీదేవి, 4న గాయత్రీదేవి, 5న అన్నపూర్ణాదేవి, 6న లలితా త్రిపుర సుందరీదేవి, 7న మహాచండీదేవి, 8న మహాలక్ష్మీదేవి, 9న సరస్వతీదేవి, 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దనీదేవి, 12న రాజరాజేశ్వరిదేవి అలంకరణల్లో దర్శనమివ్వనున్నారు. నవరాత్రి రోజుల్లో ప్రత్యేక కుంకుమ పూజలు చేయనున్నామని ఆలయ ఈఓ అలివేణి తెలిపారు. ఈనెల 6న ఉదయం 8 గంటల నుంచి ఆలయ ఆవరణలో శ్రీ చక్రనవావరణ సహిత చండీ హోమం, 9న మూలనక్షత్రం సందర్భంగా విద్యార్థులతో ఉదయం 10 గంటల నుంచి ఆలయ ఆవరణలో శ్రీ సరస్వతీదేవి పూజ, ఈనెల 12న విజయదశమి రోజున రాత్రి 8 గంటల నుంచి పోలీస్ అధికారులతో శమీపూజ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 10 గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment