ఉద్యమంలా ‘స్వచ్ఛతా హీ’
భీమవరం (ప్రకాశంచౌక్): దేశ పౌరులంతా స్వచ్ఛతా కార్యక్రమాలను ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. సెప్టెంబర్ 17 నుంచి నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ కార్యక్రమాల ముగింపు ఉత్సవాలను బుధవారం భీమవరం మునిసిపల్ కార్యాలయం ఆవరణంలో అట్టహాసంగా నిర్వహించారు. తొలుత గాంధీ జయంతిని పురస్కరించుకొని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కలెక్టర్, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గం, ఉద్యమాలు చేసినటువంటి శాంతి దూత జాతిపిత మహాత్మాగాంధీ అని అన్నారు. అలాగే మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి, చింతలపాటి బాపిరాజు జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం మన కనీస బాధ్యతని అన్నారు. మన ఇంటిని, పరిసరాల శుభ్రత విషయంలో మనమే బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో విశేష సేవలు అందించిన సఫాయి మిత్రులకు, ఎన్‌జీఓలు, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలను సత్కరించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, కనుమూరి రఘురామ కృష్ణరాజు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment