అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు

Published Fri, Oct 18 2024 12:52 AM | Last Updated on Fri, Oct 18 2024 12:56 AM

అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు

యలమంచిలి: తన భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కొంతేరు గ్రామానికి చెందిన రేజేటి కోమలి గురువారం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపారు. కోమలికి రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన పూడివలస రాజుతో క్రిస్టియన్‌ సంప్రదాయంలో వివాహమైంది. వివాహ సమయంలో రూ.3.50 లక్షలు నగదు, రెండు కాసులు బంగారం కట్నం ఇచ్చారు. వీరి సంసారం ఆరు నెలలు బాగానే సాగింది. ఆ తర్వాత నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు శారీరికంగా, మానసికంగా వేధిస్తున్నారని కోమలి ఫిర్యాదులో పేర్కొంది. గత నెల 14న అదనపు కట్నం తీసుకురాకపోతే కుదరదని తరిమేయడంతో పుట్టింటికి వచ్చేసింది. ఈ మేరకు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య తెలిపారు.

వివాహిత ఫిర్యాదు..

కాళ్ల: అదనపు కట్నం వేధింపులపై వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాళ్ళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుపాడు గ్రామానికి చెందిన ఆదిగిరి నాగలక్ష్మికి ఆకివీడు మండలం దుంపగడప గ్రామానికి చెందిన మావుళ్ళయ్యతో సుమారు 26 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. అయితే ఇప్పుడు ఆమెను అదనంగా లక్ష రూపాయలు అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అతని సోదరుడు, అత్తమామలు వేధిస్తున్నారంటూ నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు.

మందుబాబులకు అడ్డాగా..

అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా వరాహ పుష్కరిణి

ఆగిరిపల్లి: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారికి చెందిన వరాహ పుష్కరిణి మందుబాబులకు అడ్డాగా మారింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రంలోనే అతి పెద్దదైన వరాహ పుష్కరిణి (మెట్ల కోనేరు) అసాంఘిక కార్యకలాపాలకు వేదికై ంది. దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో రాత్రయితే చాలు వరాహ పుష్కరిణి మెట్లపై మందుబాబులు మద్యపానం, ధూమపానం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో మద్యం సీసాలు, చికెన్‌ వ్యర్థాలు, వాటర్‌ ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ గ్లాసులతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోంది. వరాహ పుష్కరిణి పవిత్రతను కాపాడి మందుబాబుల ఆగడాలు అరికట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఇదే విషయంపై ఎస్సై శుభశేఖర్‌ మాట్లాడుతూ వరాహ పుష్కరిణి మెట్లపై మద్యపానం, ధూమపానంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement