చటాకాయలో అరాచకం
కైకలూరు: కొల్లేరు గ్రామాల్లో మూఢనమ్మకాల మా టున అరాచకాలు సాగుతున్నాయి. ప్రభుత్వానికి సమాంతరంగా పెద్దల మాటున పంచాయితీలు కొనసాగుతున్నాయి. కై కలూరు మండలం చటాకాయ గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో ముగ్గురిని చేతబడి నెపంతో స్తంభాలకు కట్టి 18 మంది కర్రలతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ ఉప సర్పంచ్ భర్త ఘంటసాల చినసుబ్బరాజుకు నీటి కాల్వపై కాపలా ఉండే సైదు రఘునకు నెల రోజుల క్రితం నీటి తూముల విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 25న గ్రామంలో పెద్దల వద్ద సుబ్బరాజు పంచాయితీ పెట్టి రఘు చేతబడులు చేస్తున్నాడని ఆరోపించాడు. దీంతో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రఘును స్తంభానికి కట్టి కర్రలతో చితకబాదారు. ఆ సమయంలో రఘు భార్య మంగతాయారు అడ్డురాగా ఆమెనూ ఈడ్చిపడేశారు. పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరించడంతో రఘు ప్రాణభయంతో చేతబడిలో తనతో పాటు మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ, మరో ఏడుగురు ఉన్నారని చెప్పాడు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. దీంతో ఆగ్రహించిన పెద్దలు రఘుతోపాటు రాంబాబు, ధనుంజయను స్తంభాలకు కట్టి అదేరోజు రాత్రి 8 గంటల నుంచి వేకువజామున 4 గంటల వరకు చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రగాయాలైన రాంబాబు, ధనుంజయ ఏలూరులో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. రఘు ఈనెల 26న భార్యను తీసుకుని ద్విచక్రవాహనంపై పారిపోయాడు. సీఎం చంద్రబాబు నివాసం, సచివాలయం, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఏలూరు ఎస్పీ శివకిషోర్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అనంతరం సైదు రఘు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరి జరిగిన విషయాన్ని కై కలూరు పోలీసులకు చెప్పాడు. దీంతో చటాకాయ గ్రామస్తులు ఘంటసాల చినసుబ్బరాజు, దేశింగిరాజు, కుటుంబరావు, ముంగర గంగాధరరావు, బలే చంద్రయ్య, శ్రీవేంకటేశ్వర్లుపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 29న కేసు నమోదు చేశారు.
రక్షణ కల్పించాలని వినతి
తమకు గ్రామంలో రక్షణ లేదని, రాజీ ప్రయత్నాలకు పెద్దలు వస్తున్నారని, తమకు హాని తలపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు రఘు, మంగతాయారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్పత్రిలో ఉన్న రాంబాబు, ధనుంజయ వైద్యం ఖర్చులు భరిస్తామన్న గ్రామ పెద్దలు ఇప్పుడు తమకు సంబంధం లేదని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏలూరు ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్య రిపోర్టులు కీలకంగా మారాయని, చటాకాయ గ్రామంలో పోలీసు అధికారులు రాత్రి నిద్ర చేసి పెద్దలతో మాట్లాడారని ఎస్సై వి.రాంబాబు తెలి పారు. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని ఆయన అన్నారు.
చేతబడి నెపంతో ముగ్గురిపై దాడి
స్తంభానికి కట్టి పైశాచికానందం
కొల్లేరు గ్రామాల్లో సమాంతర పాలన
పంచాయితీల మాటున దారుణాలు
Comments
Please login to add a commentAdd a comment