తాడేపల్లిగుడెంలో విలేకరుల సమావేశంలో మట్లాడుతున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం సంక్షేమం అందించలేని అసమర్థ పాలకుడని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళిని ప్రజలు అసంతృప్తిగా నిర్వహించుకోవడం బాధాకరమన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా.. సూపర్‌సిక్స్ హామీల్లో ఒక్కటీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, జగన్ ప్రభుత్వంలో ధరలకు, కూటమి ప్రభుత్వంలో ధరలకు వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు రూ.4,800 కోట్ల పాత విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపడం దారుణమని అన్నారు. ఐదు నెలల్లోనే రూ.59 వేల కోట్లు అప్పు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జగన్ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని అధోగతిపాలు చేశారని, 108 సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
మాటలు నమ్మి మోసపోయిన జనం
ఇసుక ఉచితమని చెప్పి ఇప్పుడు ఆరు యూనిట్లకు సుమారు రూ.15 వేలు, మూడు యూనిట్లకు రూ.11 వేలు వసూలు చేస్తున్నారని కొట్టు విమర్శించారు. ఇసుక కొనలేక నిర్మాణాలు నిలిచిపోతే కూలీలు పనులు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల తేనె పూసిన కత్తి మాటలు విని ప్రజలు అధోగతి పాలయ్యారన్నారు. లిక్కర్ క్వార్టర్ బాటిల్ రూ.99కే అని చెప్పి ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ వరదల సమయంలో చంద్రబాబుకు అందిన విరాళాల వివరాలు వెల్లడించకపోవడం అవినీతికి తార్కాణమని కొట్టు అన్నారు. మంచినీటి బాటిళ్లకు రూ.26.80 కోట్లు, కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చయిందని చెప్పడం దోపిడీతనాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్
పాలనపై ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేశారని కొట్టు మండిపడ్డారు. తిరుమల తిరుపతికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని చెప్పిన వ్యక్తికి చైర్మన్ పదవిని ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఆ పాపం చంద్రబాబుదే
జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టి కుటుంబాన్ని విడదీసిన పాపం చంద్రబాబుకే దక్కుతుందని కొ ట్టు అన్నారు. చెల్లి మీద అభిమానంతో తండ్రి ఉన్న సమయం నుంచి ఇప్పటివరకు ఆస్తిలో వాటాను ఇచ్చిన అభిమాన అన్నగా జగన్ నిలిచారన్నారు. అన్నపై తప్పుడు కేసులు పెట్టించిన వ్యక్తితో అంటకాగడం షర్మిలకు సరికాదని మంత్రి కొట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు ఏమి చెప్పమంటే అదే మాటలు ప్రజలకు వల్లె వేయడం అతని అనైతికతకు తార్కాణమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు. కూటమి పాలనకు ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment