నిలిచిన108 సేవలు
సాక్షి, భీమవరం: ఆపదలో మృత్యువుతో పోరాడు తున్న వేళ.. ఫోన్ చేసిన 15 నిముషాలకే కుయ్.. కుయ్‌మంటూ చెంతకొచ్చి ప్రాణాలను నిలిపే అపర సంజీవని 108కు సర్కారు నిర్లక్ష్య గ్రహణం పట్టింది. డీజిల్ బిల్లులు విడుదలకాక ఎక్కడికక్కడ 108 అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. అత్యవసర సేవలందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 108 అంబులెన్స్‌లు 48 ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 27, పశ్చిమగోదావరిలో 21 వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనం రోజుకు ఐదు నుంచి ఆరు వరకు కాల్స్ చొప్పున 288 మందికి అత్యవసర సేవలు అందిస్తాయి. ఆపదలో ఉన్న వారికి అవసరమైన ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రులకు చేరవేస్తుంటాయి. ప్రతి రోజూ ఒక్కో 108 వాహనానికి డీజిల్ ఖర్చుల నిమిత్తం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు వరకు విడుదల చేస్తారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి సరిగా నిధుల విడుదల చేయకపోవడంతో సేవలు నిలిచిపోతూ వస్తున్నాయి. ఏలూరు జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో 18 వరకు వాహనాలు నిలిచిపోగా పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం నాటికి 15 అంబులెన్స్‌లు ఆగిపోయాయి. మిగిలిన వాహనాలు డీజిల్ ఉన్నంత వరకు తిరిగి తర్వాత అవి ఆగిపోతాయని 108 సిబ్బంది చెబుతున్నారు.
వైఎస్ హయాంలో పురుడు పోసుకుని
దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ చేతుల మీదుగా పురుడుపోసుకున్న 108 పథకం అనతికాలంలోనే అపర సంజీవనిగా ఖ్యాతిగాంచింది. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. గత టీడీపీ హయాంలో వీటి నిర్వహణ సరిగా లేక చాలా వాహనాలు మూలకు చేరి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందక ఇబ్బంది పడాల్సి వచ్చేది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీటికి జీవం పోశారు. అప్పటి వరకు రూ.12 వేల వరకు ఉన్న 108 సిబ్బంది జీతాలను సీనియారిటీ ప్రాతిపదికన రూ.18 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు.
మూడు నెలలుగా అందని జీతాలు
ఒక్కో వాహనానికి ఇద్దరు ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వీరికి రిలీవర్లుగా రెండు వాహనాలకు కలిపి ఒక ఈఎంటీ, ఒక డ్రైవర్ ఉంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది వరకు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నెలకు ఒక్కో వాహనంలోని సిబ్బందికి సుమారు రూ.1.25 లక్షల చొప్పున ఉమ్మడి జిల్లాలోని సిబ్బందికి రూ. 60 లక్షల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదలవ్వక రూ.1.8 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. జీతాలు అందక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. సేవలు నిలిచిపోవడంపై 108 జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్‌బాబును వివరణ కోరగా డీజిల్ బిల్లులు రావాల్సి ఉందని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు.
ఐదేళ్లలో 108 సేవలు ఆగడం ఇదే ప్రథమం
గతంలో రెండు మూడు రోజులు బిల్లులు ఆలస్యమైనా పెట్రోల్ బంక్‌ల యాజమాన్యాలు డీజిల్ కొట్టేవారని చెబుతున్నారు. ప్రస్తుతం 108 నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న సంస్థ తప్పుకోనుందంటూ జరుగుతున్న ప్రచారంతో బిల్లులు రావనే భయంతో అరువుపై డీజిల్ కొట్టేందుకు బంకు యజమానులు భయపడుతున్నారు. గత ఐదేళ్లలో డీజిల్ లేక 108 అంబులెన్స్‌లు ఆగడం ఇదే మొదటిసారని 108 ఉద్యోగి ఒకరు తెలిపారు. వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో 350కు పైగా కాల్స్‌కు సేవలు అందలేదు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద ప్రతి నెలా 8, 9, 10 తేదీల్లో గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేస్తుంటారు. ఆ సమయంలో వారిని 108 అంబులెన్స్‌ల్లోనే ఆస్పత్రులకు చేరవేస్తుంటారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వైద్యపరీక్షలు జరుగనుండగా అంబులెన్స్ సేవలు నిలిచిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
డీజిల్ బిల్లులు విడుదల కాక తిరగని వాహనాలు
అత్యవసర సేవలకు అంతరాయం
మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించని ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment