కార్యకర్తలకే ప్రాధాన్యం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
యలమంచిలి: వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలమని, ఇకపై వారి చెప్పిన దానికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. కలగంపూడి గ్రామంలో బుధవారం జరిగిన పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావని ప్రసాదరాజు భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యతనిస్తూ సమన్వయ కమిటీ వేస్తామని, ఆ కమిటీ చేసిన సిఫార్సులకు మాత్రమే పనులు చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి నెల నియోజవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలన్నీ రద్దయ్యాయని, త్వరలో కొత్త కమిటీలు కార్యకర్తల అభీష్టం మేరకు వేస్తామన్నారు. కూటమి నాయకులు కేసులు పేరిట భయపెడితే ఎవరూ అధైర్యపడవద్దని ప్రసాదరాజు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సీనియర్ లాయర్లతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏ కార్యకర్త మీదైన అక్రమ కేసులు పెడితే, ఆ సమాచారం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులకు చెప్పాలన్నారు.
లోపాలు సరిచేసుకుందాం: గుడాల గోపి
నియోజకవర్గంలో కార్యకర్తల కష్టాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని, నాయకుల అనైక్యత వలనే ప్రత్యర్థి విజయం సాధిస్తున్నాడని, పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన వారికి ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు మాట్లాడుతూ ఇంతవరకు జరిగిన వాటిలో లోపాలు ఉంటే సరి చేసుకుంటానన్నారు. ఇకపై కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి అభీష్టం మేరకు పని చేస్తానన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడు తూ ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, 11 సీట్లకే పరిమితమయ్యామనే నిరాశ వద్దని, మనకు 40 శాతం ఓట్లు ఉన్నాయనే యథార్థాన్ని గుర్తించాలని కోరారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ మన పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత లేదన్నారు. ప్రత్యర్థి పార్టీలు మూడూ కూటమిగా ఏర్పడడం వలనే ఓటమి పాలయ్యామన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుందామని చెప్పారు. ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో గ్రూపులు లేవన్నారు. నాయకులంతా కృషి చేయడం వలనే అన్ని ఓట్లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ, చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, పీడీ రాజు, నడపన గోవిందరాజులునాయుడు, గుమ్మాపు పెద్దిరాజు, కవురు గోపి, ఉచ్చుల స్టాలిన్, సాలా నర్సయ్య, ఖండవల్లి వాసు, కుంచనపల్లి విన్‌స్టన్‌బాబు, వినుకొండ రవి, చందక సత్తిబాబు, మైలాబత్తుల మైకేల్‌రాజు, విప్పర్తి ప్రభాకరరావు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment