అవకాశాలు అందిపుచ్చుకోవాలి
తాడేపల్లిగూడెం: తరగతి గదే దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని, ఆశలను అవకాశాలుగా మార్చుకోవడమే ఆధునిక టెక్నాలజీ అని తిరుపతి ఐఐటీ కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చీమలకొండ శ్రీధర్ చెప్పారు. బుధవారం నిట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పలు విషయాల గురించి విద్యార్ధులకు వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్ధులు నిశితంగా పరిశీలిస్తే , వాటిలో నుంచి కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో భవిష్యత్ అంతా కృత్రిమ మేధస్సుదే అన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకున్నవారే ఉద్యోగ అవకాశాలను పొందగలరన్నారు. కృత్రిమ మేధస్సు, సాంకేతికత ప్రాధాన్యతలపై విద్యార్థుల సమస్యలను నివృత్తి చేశారు.
ఎస్వీకేపీలో అంతర్జాతీయ తెలుగు సదస్సు
పెనుగొండ: పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ తెలుగు సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. కళాశాల మాజీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ రామ్మోహన్‌రావు సదస్సు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం రాజమండ్రి మానస హాస్పిటల్ అధినేత డాక్టర్ కర్రి రామారెడ్డి యోగా ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల అధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, నన్నయ యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి వరప్రసాద్, వాసిలి వసంతరావు తదితరులు ప్రసంగించారు.
మావుళ్లమ్మ దీక్షల విరమణ
భీమవరం(ప్రకాశం చౌక్): మావుళ్లమ్మ అమ్మవారి దీక్ష విరమణ బుధవారం జరిగింది. ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. 400 మంది భక్తులు దీక్ష విరమించారు. అనంతరం భక్తులు పూజ సామగ్రి పూర్ణాహుతిలో సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎస్.కృపావరం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ దరఖాస్తులను డిసెంబర్, 12లోగా మైనార్టీ సంక్షేమ శాఖ, విజయవాడ 520 012 చిరునామాకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 0866–2970567 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
ఏరియా ఆసుపత్రికి అవార్డు
తాడేపల్లిగూడెం: ప్రాంతీయ ఆసుపత్రులలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2023–24 సంవత్సరానికి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి కాయకల్ప అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద రూ.10 లక్షల రివార్డు అందనుంది. రెండో స్ధానంలో ఏలూరు జిల్లా నూజివీడు ఆసుపత్రి ఎంపికై ంది. ఈ ఆసుపత్రికి రూ. 7 లక్షల రివార్డు ఇస్తారు. తమ ఆసుపత్రికి అవార్డు రావడం ఆనందంగా ఉందని సూపరింటెండెంటు డాక్టర్ తాతారావు చెప్పారు.
8న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2024–25 విద్యా సంవత్సరానికి జాతీయ ఉపకార వేతనం నిమిత్తం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష వచ్చే డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment