ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్ల కొరత
టెక్నీషియన్ల కొరత ఇలా..
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రిలో టెక్నిషియన్ల కొరతతో ఎక్స్‌రే, ఈసీజీల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంల్లో ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండగా తణుకులో జిల్లా ఆస్పత్రి ఉంది. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్స్‌రే, ఈసీజీ సౌకర్యం ఉన్నా.. సక్రమంగా సేవలు అందడం లేదు. గంటల తరబడి ఆస్పత్రుల్లో పడిగాపులు కాస్తున్నారు. అత్యవసరంగా ఈసీజీ అవసరమొస్తే రేడియోగ్రాఫర్ లేక ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఏదైన ప్రమాదం జరిగి ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు పేషేంట్లు వస్తే ఎక్స్‌రే తీసేందుకు టెక్నిషియన్ అందుబాటులో ఉండడం లేదు.
కొరత ఉన్నా స్పందించని ప్రజాప్రతినిధులు
జిల్లాలోని నాలుగు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, జిల్లా ఆస్పత్రిలో రేడియోగ్రాఫర్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్లు మొత్తం 20 మంది ఉండాలి.. కేవలం 9 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. దీంతో పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌రే, ఈసీజీలను రేడియోగ్రాఫర్ లేదా డార్క్ రూమ్ అసిసెంట్ ఎవరు ఉంటే వారు చేస్తున్నారు. ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు ఎక్స్‌రే, ఈసీజీ కోసం రోజుకు 50 నుంచి 200 మంది వరకు వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలవుతున్న ఇంతవరకూ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని నియమించలేదు. టెక్నిషియన్ కొరత ఉందని వైద్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో లేదో చూడాల్సిన ఎమ్మెల్యేలు మాకెందుకులే అన్నట్లు ఉన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో టెక్నీషియన్లు, వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.
అందుబాటులో నాలుగు ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రి
20 మంది టెక్నీషియన్లకు కేవలం 9 మంది మాత్రమే
ఎక్స్‌రే, ఈసీజీ కోసం సామాన్యుడి పడిగాపులు
తణుకు జిల్లా ఆస్పత్రి: మొత్తం నలుగురు ఉండాలి. అందులో ఒకరు రేడియోగ్రాఫర్, ముగ్గురు డార్క్ రూమ్ అసిస్టెంట్లు ఉండాలి. ఒక రేడియోగ్రాఫర్, ఒక డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉన్నారు.
నర్సాపురం ఏరియా ఆస్పత్రి: నలుగురు ఉండాలి.. ఇద్దరు మాత్రమే ఉన్నారు. రేడియోగ్రాఫర్ లేరు. డార్క్ రూమ్ అసిస్టెంట్లు ముగ్గురికి గాను ఇద్దరు ఉన్నారు.
భీమవరం ఏరియా ఆస్పత్రి: టెక్నిషియన్లు మొత్తం నలుగురు ఉండాలి.. ఒకరు మాత్రమే ఉన్నారు. రేడియోగ్రాఫర్ మాత్రమే ఉన్నారు. డార్క్ రూమ్ అసిస్టెంట్లు లేరు.
పాలకొల్లు ఏరియా ఆస్పత్రి: టెక్నిషియన్లు నలుగురు ఉండాలి కాని ఇద్దరు మాత్రమే ఉన్నారు. రేడియోగ్రాఫర్ ఒకరుండగా.. డార్క్ రూమ్ అసిస్టెంట్లు ముగ్గురికి గాను ఒకరు ఉన్నారు.
తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి: టెక్నిషియన్లు నలుగురు ఉండాలి. రేడియోగ్రాఫర్ ఒకరు, డార్క్‌రూమ్ అసిస్టెంట్లు ఇద్దరున్నారు. మరో డార్క్‌రూమ్ అసిస్టెంట్ ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment