దివ్యాంగులకు తప్పని కష్టాలు
తణుకు అర్బన్: పింఛను వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని శిబిరానికి వచ్చిన దివ్యాంగుల కష్టాలు వరుసగా మూడోరోజు కొనసాగాయి. కంటి, చెవి విభాగాలకు సంబంధించిన దివ్యాంగులకు మూడు రోజులపాటు నిర్వహించిన శిబిరం బుధవారంతో ముగిసింది. వెరిఫికేషన్‌లో భాగంగా కంటి సమస్యలతో పింఛను తీసుకుంటున్న పింఛనుదారులకు కష్టాలు తప్పలేదు. గంటల పాటు వేచిచూడడంతోపాటు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో దివ్యాంగులు ఎవరికి వారే ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి. వెరిఫికేషన్‌లో భాగంగా కంటి, చెవికి సంబంధించిన దివ్యాంగులను అధికశాతం విశాఖపట్నంలోని ప్రత్యేక సెంటర్‌లో పరీక్షలు చేయించుకోవాల్సిందిగా శిబిరంలోని వైద్యులు పంపారు. దీంతో మొదటి, రెండోరోజున విశాఖపట్నం వెళ్లిన దివ్యాంగులు అక్కడి వైద్యసిబ్బంది మళ్లీ పదిరోజుల తరువాత రావాల్సిందిగా సమయం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిబిరంలో పూర్తిస్థాయి సాంకేతిక పరికరాలు ఏర్పాటుచేయకపోవడం.. ఏకంగా విశాఖపట్నం పంపిస్తుండడంపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిబిరానికి హాజరైన దివ్యాంగులు, సహాయకులకు సత్యసాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment