పాములపర్రు కాలువకు గండి
ఉండి : మండలంలోని పాములపర్రు పంట కాలువకు తెల్లికోడు మురుగు కాలువ వద్ద ఆదివారం గండి పడింది. సాగునీరు గండి ద్వారా మురుగు కాలువలోకి వెళ్లడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉండి డీసీ వైస్‌చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు ఆధ్వర్యంలో గండి పూడిక పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. మట్టి బస్తాలతో గండిని పూడ్చారు. కాలువ గట్టు పటిష్టతకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఎంపీటీసీ యడవల్లి వెంకటేశ్వరరావు సర్పంచ్ కేశన శాంతకుమారి బలుసులరావు, నీటి సంఘ ఉపాధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వేడుకగా శోభనాచలుని కల్యాణం
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శాంతి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఉద యం రజక సంఘం ఆధ్వర్యంలో కల్యాణం జరిపించగా.. రాత్రి 8 గంటలకు వైశ్య సంఘం ఆధ్వర్యంలో గజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వమైంది. అర్చకులు వేదంతం శేషుబాబు, అనంతకృష్ణ కల్యాణ తంతు జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
12 నుంచి రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
భీమవరం: మూగ, చెముడు క్రీడాకారుల 5వ రాష్ట్రస్థాయి టీ–20 క్రికెట్ చాంపియన్‌షిప్ పో టీలు ఈనెల 12, 13 తేదీల్లో భీమవరంలో నిర్వహించనున్నారు. పోటీల బ్రోచర్‌ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తన కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చెరుకువాడ రంగసాయి, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూపతిరాజు మురళీ కృష్ణంరాజు, సీహెచ్ తాతారావు మాట్లాడుతూ భీమవరం గన్నాబత్తుల క్రీడా మైదానంలో పో టీలు నిర్వహిస్తామని, 10 జట్లు పాల్గొంటాయన్నారు. పోటీలకు డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.
పీజీఆర్‌ఎస్ రద్దు
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 3 నుంచి వచ్చేనెల 8 వరకు ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్య ల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ప్రజలు సమస్యలపై దరఖాస్తులను సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని చెప్పా రు. మరలా పీజీఆర్‌ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియజేస్తామన్నారు.
డ్రైవర్ నియామకంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
తణుకు అర్బన్ : ‘కుంటుపడ్డ పశు వైద్యం’ శీర్షికన ‘సాక్షి’ లో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర పశు ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎల్‌కే సుధాకర్ స్పందించారు. తణుకు మండలంలోని 1962 పశు వైద్య అంబులెన్స్ వాహనానికి డ్రైవర్ లేని కారణంగా తొమ్మిది నెలలుగా అందుబాటులో లేదని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచామని చెప్పారు. అత్యవసర కేసులను అత్తిలిలో అందుబాటులో ఉన్న మరో వాహనం ద్వారా అందిస్తున్నామన్నారు. డ్రైవర్ నియామకం కోసం ఉన్నతాధికారులకు నివేదించామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment