ఎస్సై ఆత్మహత్యకు కారణం పశువధ శాలే..
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు అర్బన్: ఎస్సై ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య ఘటనలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నడిపిస్తున్న లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పశువధ శాల కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది నవంబరులో వేల్పూరులో జరిగిన గేదెల చోరీకి సంబంధించి గేదెలను పశువధ శాలకు విక్రయించడం, వధింపబడిన కారణంగా పోలీసులు గేదెలను రికవరీ చేయలేని క్రమంలోనే డబ్బు లావాదేవీలు చేశారని చెప్పారు. తణుకు రూరల్ సర్కిల్ కార్యాలయంలో డబ్బు కట్టలతో చేసిన లావాదేవీల్లో ఎస్సై మూర్తి లేకపోయినా అధికారులు చేసిన కుట్రలో ఆయన బలిపశువుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. గేదెలు రికవరీ అయితే డబ్బు లావాదేవీలకు ఆస్కారం ఉండేది కాదని, ఎస్సై వీఆర్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండేది కాదని తెలిపారు. వీఆర్ లో ఉన్న ఎస్సై తీవ్ర మనోవేదనతోనే ఆత్మహత్యకు ప్రేరేపించబడ్డారని చెప్పారు. పశువధ శాలకు అనుమతులు లేకపోయినా పోలీసులను కాపలాగా పెట్టి నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణనే దీనంతటికీ కారకుడని దుయ్యబట్టారు. ఎస్సైను ఇబ్బంది పెట్టినవారు ఎవరనేది ఆయన ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉందని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని బయటపెట్టాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కేసును ప్రత్యేక సిట్‌తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎస్సై కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని మాజీ మంత్రి కారుమూరి చెప్పారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అరాచకాలకు అడ్డాగా తణుకు
ప్రశాంతతకు మారుపేరైన తణుకు నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో అరాచకాలకు అడ్డాగా మారిందని, రాష్ట్రవ్యాప్తంగా మాయని మచ్చలను ఎమ్మెల్యే అంటిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి ధ్వజమెత్తారు. పశువధ శాల ప్రాంతంలో ఉండలేకపోతున్నామని రోడ్డెక్కిన మహిళలను కిరాయి మూకలతో కొట్టించిన ఘనత ఆరిమిల్లికే దక్కుతుందని విమర్శించారు. గతంలో ఆరిమిల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక ఎస్సైని కింద కూర్చోబెట్టి అ వమానించారని, నేడు తన అరాచకాలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఉన్న మరో ఎస్సైని ఇక్కడ నుంచి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశా రు. పేకాట, కోడి పందేలు, అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అనుయాయులను అధికారులు అడ్డుకుంటే.. వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారులు ఒత్తిళ్లతో నలిగిపోతున్నారన్నారు. డబ్బే ప్రధానంగా రాజకీయం చేస్తూ ప్రజలను విస్మరిస్తున్నాడని ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగిందేమీ లేదని, బి హార్ కోట్లాది రూపాయలు సాధించుకుందని, ఇక్కడి నేతలు ఏమీ తేలేకపోయారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, జిల్లా సెక్రటరీ ఆర్గనైజేషన్ ఇందుగపల్లి బలరామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment