గంపగుత్తగా రాబట్టాలని.. | Sakshi
Sakshi News home page

గంపగుత్తగా రాబట్టాలని..

Published Tue, May 7 2024 11:50 AM

గంపగు

సాక్షి, యాదాద్రి : పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ అభ్యర్థులు ఓట్ల వేటను ముమ్మరం చేశారు. ప్రధానంగా గంపగుత్తగా ఓట్లు సాధించే అంశాలపై దృష్టి సారించారు. అందులో భాగంగా సామాజిక వర్గాలతో పాటు యువజన సంఘాల మద్దతు కూడగట్టేందుకు ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆయా సంఘాలకు హామీలు గుప్పించడంతో పాటు బేరసారాలు నెరుపుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్య నాయకులకు

సమ్మేళనాల బాధ్యతలు

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పెద్ద ఎత్తున ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. గౌడ, గొల్లకుర్మ, పద్మశాలి, ముదిరాజ్‌, విశ్వకర్మలు, రజకులు, మున్నూరుకాపు.. ఇలా అన్ని బీసీ వర్గాలతో పాటు దళిత సంఘాలతో మున్సిపల్‌, మండల, గ్రామ స్థాయిలో సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. ఈ సభలకు ఆయా సంఘాలకు చెందిన జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఆర్యవైశ్యులు, రెడ్డి కుల సంఘాల నేతలను సైతం ప్రత్యేకంగా కలిసి మద్దుతు కూడగట్టే ప్రయత్నం అభ్యర్థులు చేస్తున్నారు. తమ పార్టీల విధి విధానాలు, గతంలో ప్రజలకు చేసిన పనులు, సేవా కార్యక్రమాలు, గెలుపొందితే చేయాలనుకుంటున్న పనులను వివరిస్తున్నారు. ఇదే అదనుగా కుల సంఘాల నేతలు తమ సమస్యలను అభ్యర్థుల ముందుంచి హామీలు పొందుతున్నారు. బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. కాగా ఆత్మీయ సమ్మేళనాల బాధ్యతలను ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కుల సంఘాలకు ప్రాతినిథ్యం వహించే నాయకులు చూస్తున్నారు.

బలనిరూపణలో కుల సంఘాల నేతలు

ప్రధాన రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటించిన కుల సంఘాల పెద్దలు.. ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ బలం, బలగం ఏమేరకు ఉందో నిరూపించుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామం నుంచి సమ్మేళనాలకు పెద్ద సంఖ్యలో తమ సామాజికవర్గం వ్యక్తులను తరలిస్తున్నారు. వారికి రవాణా, భోజన వసతులు సంఘం నాయకులే చూస్తున్నారు. ప్రతి పార్టీ రోజూ కనీసం రెండు చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి.

యువజన సంఘాలతోనూ..

యువజన సంఘాలతోనూ ప్రధాన రాజకీయ పా ర్టీలు ప్రత్యేకంగా సమావేశం అవుతూ మద్దతు కోరుతున్నాయి. వారి డిమాండ్లు నెరవేర్చందుకు హామీలిస్తున్నాయి. అంతేకాకుండా ముందుగానే బేరసారాలు కుదర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

సమ్మేళనాలకు అధిక ప్రాధాన్యం

ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓ వైపు బహిరంగ ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. ప్రచారం ముగింపునకు మరో ఐదు రోజులే సమయం ఉండడంతో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కుల సంఘాలతో ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తమ ప్రభుత్వాలు కుల సంఘాలకు చేసిన పనులు, వారితో పార్టీకి ఉన్న అనుబంధం మొదలైన అంశాలను వివరిస్తూ ఓట్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారు.

సామాజికవర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో పార్టీలు

ఫ ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలు

ఫ యువజన సంఘాలతోనూ

ప్రత్యేక సమావేశాలు

ఫ హామీలు గుప్పిస్తున్న అభ్యర్థులు

గంపగుత్తగా రాబట్టాలని..
1/3

గంపగుత్తగా రాబట్టాలని..

గంపగుత్తగా రాబట్టాలని..
2/3

గంపగుత్తగా రాబట్టాలని..

గంపగుత్తగా రాబట్టాలని..
3/3

గంపగుత్తగా రాబట్టాలని..

Advertisement

తప్పక చదవండి

Advertisement