ఇబ్బందులకు గురిచేసే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు
చౌటుప్పల్ : ధాన్యాన్ని దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులకు గురిచేసే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆయా ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెడుతామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చౌటుప్పల్ డివిజన్ పరిధిలో ఇటీవల వచ్చిన 261 ధరణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కుల, ఆదాయ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చెరువులు, శిఖం భూములను సర్వే చేయిస్తామన్నారు. జీపీ, హెచ్‌ఎండీఏ వెంచర్లలోని 10 శాతం భూమికి సంబంధించిన నివేదికను రూపొందిస్తామని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు. అదేవిధంగా ముత్యాల శంభారెడ్డి వ్యవసాయ క్షేత్రం సమీపంలోని శ్రీకృష్ణ రీలింగ్ యూనిట్‌ను సందర్శించారు. పట్టు పురుగులతో దారాన్ని తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. వివరాలను నిర్వాహకుడు గంజి శ్రీహరిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, ఆర్‌ఐలు సుధాకర్‌రావు, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment