వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు
బొమ్మలరామారం: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బొమ్మలరామారం మండలంలో బుధవారం జరిగింది. బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన చెవ్వ గణేష్‌కు 15 రోజుల క్రితం కుమార్తె జన్మించింది. బుధవారం గణేష్ తన భార్య, కుమారుడు, కుమార్తెను హైదరాబాద్ నుంచి తన స్నేహితుడు సాదం నవీన్‌తో కలిసి అతని కారులో స్వగ్రామానికి తిరిగి తీసుకొస్తున్నాడు. మార్గమధ్యలో బొమ్మలరామారం మండలం రంగాపూర్ శివారులోని ఓం శివ ఫంక్షన్ హాల్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాదం నవీన్‌తో పాటు గణేష్‌కు అతడి భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సింకిద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారును క్రేన్ సహాయంతో ఘటనా స్థలం నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
లారీ బోల్తా పడి క్లీనర్‌కు..
వలిగొండ: ఢిల్లీ నుంచి తమిళనాడు వెళ్తున్న లారీ వలిగొండ మండల కేంద్రంలోని మదర్ డెయిరీ పాల సెంటర్ మూలమలుపు వద్ద బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ వీరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బైక్ ఢీకొని..
అడ్డగూడూరు: భైక్ ఢీకొని వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామ శివారులో బుధవారం జరిగింది. చౌల్లరామారం గ్రామానికి చెందిన తలపాక యాదయ్య బుధవారం రాత్రి అదే గ్రామంలోని ఓ వ్యక్తి అంత్యక్రియలో పాల్గొని తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. గ్రామ శివారులోని గోదాము వద్ద అతడిని భైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తికి..
గరిడేపల్లి: ట్రాక్టర్ బోల్తాపడడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో బుధవారం జరిగింది. పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన జూకూరి సైదులు మిర్యాలగూడలోని రైస్ మిల్లులో వడ్లు దిగుమతి చేసి తిరిగి వెళ్తుండగా.. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద సూర్యాపేట–గరిడేపల్లి రహదారిపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సైదులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment