ఇకనుంచి.. వంద మార్కులకు టెన్త్ పరీక్షలు
భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షలకు100 మార్కులు ఉండనున్నాయి. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేస్తూ విద్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇంటర్నల్ 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కులు ఇచ్చేవారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని విద్యాశాఖ భావిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులు 9,290 మంది
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ 715, ప్రైవేట్ పాఠశాలలు 156 ఉన్నారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 9,290 మంది ఉన్నారు. మార్చి లేదా ఏప్రిల్‌లో జరగబోయే వార్షిక పరీక్షలకు వారంతా హాజరు కానున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు 100 మార్కుల విధానం కోసం సన్నద్ధం కావాల్సి వస్తుంది. ఇప్పటికే సిలబస్ పూర్తి కావస్తుండడంతో పాటు ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. దీని వల్ల విద్యార్థులకు సమయం సరిపోతుందా అనేది ఉపాధ్యాయులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
30న పాఠశాలలు బంద్
భువనగిరిటౌన్ : విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హాస్టళ్లలో వరుసగా ఫుడ్ ఫాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విద్యాశాఖ విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి చొరవచూపి విద్యాశాఖ, వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలపై సమీక్ష నిర్వహంచి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఐకేపీ వీఓఏల జేఏసీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
భువనగిరి : ఐకేపీ వీఓఏ(ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అండ్ అసిస్టెంట్)ల జేఏసీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని గురువారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా భూక్యా నెహ్రూనాయక్, గౌరవ అధ్యక్షుడిగా పెసరు అరుణ, అధ్యక్షురాలు మినుముల పద్మావతి, కార్యదర్శిగా కొండా రుద్రమాదేవి, కోశాధికారిగా షేక్ సైదాభేగం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాలేకర్ ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షడిగా పోశెట్టి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా మంజుల, రూప్లానాయక్, ప్రచార కార్యదర్శిగా సాయిగౌడ్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
నృసింహుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు తొలుత సుప్రభాత సేవ చేపట్టి స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment