ఆరోగ్యానికి చలి ముప్పు
సాక్షి, యాదాద్రి: జిల్లాలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. సాయంత్రం ఆరు దాటిందంటే జనాలు బయట రావడానికి భయపడుతున్నారు. బుధవారం రాజాపేట మండలంలో 15.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పోచంపల్లి మండలంలో19, రాజాపేట మండలంలో15.3, చౌటుప్పల్ మండలంలో18, మోటకొండూరులో 18.5, వలిగొండలో 17, ఆలేరు మండలంలో 19.5 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలి కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు దగ్గు, జలుబు, జ్వరం, ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్, జనవరిలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
పిల్లలు, వృద్ధుల్లో అలర్జీ లక్షణాలు
పెరుగుతున్న చలి కారణంగా పిల్లలు, వృద్ధుల్లో అలర్జీ లక్షణాలు కనిపిస్తున్నాయి. కాళ్లు, చేతులపై చర్మం ముడత పడటంతో పాటు కీళ్ల సంబంధ సమస్యలు వస్తున్నాయి. కొంతమందిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. చర్మం పొడిబారడం కారణంగా దురద, మంటతో పాటు పగుళ్లు ఏర్పడుతున్నాయి. చాలా మందిలో జ్వరం లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. చలి తీవ్ర ప్రభావం నుంచి తప్పించుకోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అవకాశం ఉన్న వారు ఉదయం తొమ్మిది గంటల తర్వాతనే బయటకు రావాలని, సాయంత్రం 5 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని చెబుతున్నారు.
తప్పని వెతలు..
ప్రతి రోజూ ఉదయం నుంచే చల్లటి గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. రోడ్లపై పనిచేసే మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్, రోజువారీ కూలీలు, వివిధ పనుల కోసం తెల్లవారు జామునే వెళ్లే వారు చలికి అనారోగ్యానికి గురవుతున్నారు.
రెండు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా.. (డిగ్రీల సెల్సియస్‌లో)
మండలం 26వ తేదీ 27వ తేదీ
బొమ్మలరామారం 13.2 16
వలిగొండ 14.1 17
రామన్నపేట 14,2 18
రాజాపేట 14.5 15.3
గుండాల 14.5 17
చౌటుప్పల్ 14.5 18
మోటకొండూర్ 14.6 18.5
ఆలేరు 14.6 19.5
తుర్కపల్లి 14.7 17.9
పోచంపల్లి 14.8 19
మోత్కూర్ 14.9 20
భువనగిరి 15.0 20.1
ఫ రోజు రోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఫ రాజాపేటలో 15.3 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
ఫ డిసెంబర్, జనవరిలో
చలి మరింత పెరిగే అవకాశం
ఫ జాగ్రత్తలు తీసుకోవాలని
సూచిస్తున్న వైద్యులు
ముందు జాగ్రత్తలు తప్పనిసరి
చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను చలిగాలిలో తిప్పకుండా వెచ్చని వాతావరణంలో ఉండేలా చూడాలి. తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వస్తే తలకు మంకీ క్యాప్, స్వెటర్, మాస్క్ ధరించాలి. డిసెంబర్ నుంచి జనవరి వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చలి గాలులు ఎక్కువగా వీచే సమయంలో కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా బీపీ ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్ విలియమ్స్, పీహెచ్‌సీ వైద్యుడు, యాదగిరిగుట్ట
Comments
Please login to add a commentAdd a comment