కాల్వ పూర్తి చేసి సాగునీరు అందించాలి
ఆలేరురూరల్: ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. ఆలేరు మండలంలోని టంగుటూరు, పటేల్‌గుడెం గ్రామాల్లో గత 15 సంవత్సరాల క్రితం అసంపూర్తిగా నిర్మించి వదిలివేసిన దేవాదుల కాలువను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఆశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి కాలువలు తవ్వి లైనింగ్ వేసి వదిలేశారన్నారు. పాలకులు మారుతున్నా పేదల బతులకు మాత్రం మారడం లేదన్నారు. ఆలేరు ప్రాంతం పంట పొలాలకు నీరులేక ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు యోగ్యమైన భూములను సేకరించి కాలువలను తవ్వి వృథాగా వదిలివేయడంతో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం స్పందించి అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఆలేరు పట్టణ, మండల కార్యదర్శి ఎంఏ ఇక్బాల్, దూపటి వెంకటేష్, సుదగాని సత్యరాజయ్య, తులసయ్య, దాసి శంకర్, మల్లేశం, ఉప్పలయ్య, మల్లిఖార్జున్, అశోక్, ఉదయ్, నవీన్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment