సమ్మెలో సమగ్ర శిక్షా ఉద్యోగులు
భువనగిరి : సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మెతో కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో భోదన నిలిచిపోయింది. విద్యార్థులకు కీలక తరుణం కావడంతో బోధనకు ఆటంకం ఏర్పడి సిలబస్ ముందుకు సాగడంలేదు. ఫలితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బోధనేతర సిబ్బంది సైతం సమ్మె చేస్తుండడంతో ఎమ్మార్సీలు, డీఈఓ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. వివిధ రకాల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
742 మంది ఉద్యోగులు
సమగ్ర శిక్షా అభియాన్ కింద జిల్లాలో కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత కేంద్రాలు, ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది సుమారు 742 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో బోధనా సిబ్బంది 250 వరకు ఉన్నారు. వీరితో పాటు విద్యాశాఖ జిల్లాస్థాయిలో ఏపీఓలు, డీపీఓలు, సాంకేతిక నిపుణులు, సిస్టమ్ అనాలసిస్టులు, భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవలందించే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మండల స్థాయిలో కంప్యూటర్ సహాయకులు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాచ్‌మెన్లు, స్వీపర్లు, స్కావెంజర్లు ఉన్నారు. వీరంతా 2004నుంచి పనిచేస్తు న్నారు. 15 రోజులుగా సమ్మె చేస్తుండడంతో అటు బోధన, ఇటు పాలన విషయంలో ప్రభావం చూపుతుంది.
3 వేలకు పైగా విద్యార్థులు..
జిల్లాలో 11 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 3వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు.వీరిలో పదో తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులు చదువుకుంటున్నారు. బోధన సిబ్బంది సమ్మెలో ఉండడంతో బోధన చేసేవారు లేరు. ఒక్కరిద్దరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా ఆశించన మేర సిలబస్ కావడం లేదు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా మండల విద్యా శాఖ కార్యాలయాల్లో యూడైసీ, మధ్యాహ్న భోజనం తదితర బిల్లులు నిలిచిపోయాయియి.
డిమాండ్లు ఇవీ..
● సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి.
● పే స్కేల్ వర్తింపజేయాలి.
● రూ.20 లక్షల జీవితా బీమా, రూ.10లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.
● పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.25 లక్షలు చెల్లించాలి.
● ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వెయిటేజీ మార్కులు కేటాయించాలి.
20 ఏళ్లుగా పనిచేస్తున్నాం
సమగ్ర శిక్షా ఉద్యోగులు తక్కువ వేతనంతో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరిపట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షా ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించడంతో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి.
–ఎం.పాండు, సమగ్ర శిక్షా
ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
15 రోజులుగా విధులకు దూరం
ఫ కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో నిలిచిన విద్యాభోధన
ఫ కీలక సమయంలో సాగని సిలబస్
ఫ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
వంటావార్పుతో నిరసన
భువనగిరిటౌన్ : తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 14వ రోజుకు చేరంది. సమ్మెలో భాగంగా ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట రోడ్డు పక్కన వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే దాకా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాండు తిరుపతి, నాగార్జున, ఉద్యోగులు పాల్గొన్నారు
ప్రభుత్వం మాట నిలుపుకోవాలి
చాలా ఏళ్లుగా చాలీచాలని వేతనంలో పని చేస్తున్నాం. గత ప్రభుత్వం హయాంలో 25 రోజుల పాటు సమ్మె చేశాం. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా నెరవేర్చడం లేదు. హామీ నెరవేర్చి మాట నిలుపుకోవాలి.
–అరుణ, సమగ్ర శిక్షా
ఉద్యోగుల సంఘం నాయకురాలు
Comments
Please login to add a commentAdd a comment