భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ
భువనగిరిటౌన్ : రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడేందుకు అధికారులే కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారి భద్రతా చర్యలు చేపట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, సూచిక బోర్డులు, బ్లింకర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్ల పక్కన చెత్త పడేయకుండా చూడాలని, లేకపోతే ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉంటాయన్నారు. వాహనాలను మితిమీరిన వేగంతో నడపడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ పరిమితిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment