27 నుంచి భూ పత్రాల స్వీకరణ
భువనగిరి : రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భువనగిరి మండలంలోని గౌస్‌నగర్, కేసారం, ఎర్రంబెల్లి, తుక్కాపురం, పెంచికల్‌పహాడ్, రాయగిరి గ్రామాల పరిధిలో కిలో మీటర్ 118.188 నుంచి 133.178 కి.మీ పరిధిలోని రైతులు తమ భూముల వివరాలకు సంబంధించిన పత్రాలు అందజేయాలని ఆర్డీఓ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న గౌస్‌నగర్, కేసారం, 28న ఎర్రంబెల్లి, తుక్కాపురం, 30న పెంచికల్‌పహాడ్, రాయగిరి గ్రామాల రైతులు భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. భూమి విస్తీర్ణం, భూమిలో ఉన్న ఆస్తులు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలను ఫార్మాట్‌లో పొందు పర్చాలని పేర్కొన్నారు.
నేడు యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్ర పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. వేకువజామున 5గంటలకు వైకుంఠద్వారం నుంచి గిరిప్రదక్షిణ ఉంటుందని, అదే విధంగా కొండపైన స్వాతి హోమం, శత ఘటాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన మండపాల్లో యాద రుషి, ప్రహ్లాదుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారని ఈవో వివరించారు.
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు శారాజీపేట విద్యార్థులు
ఆలేరురూరల్ : ఆలేరు మండలం శారాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, ఫిజికల్ డైరక్టర్ గడసంతల మధుసూదన్ తెలిపారు. భువనగిరిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఖోఖోలో అలకుంట్ల వైష్ణవి, దూడల తేజస్వి, కబడ్డీ విభాగంలో వస్పరి జాగృతి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. వరంగల్‌లో ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. విద్యార్థులను హెచ్‌ఎం జ్యోతి, ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్, ఉపాధ్యాయులు రాజేశ్వర్‌రావు, సంజీవరెడ్డి, రామచందర్, కాంతారావు, శ్రీనివాస్ అభినందించారు.
జాతీయ రహదారిపైవాహనాల రద్దీ
చౌటుప్పల్ : పట్టణంలోని హైదరాబాద్ – విజయవాడ రహదారిపై బుధవారం వాహనాల రద్దీ నెలకొంది. క్రిస్మస్ పండుగ, వరుసగా రెండు రోజుల సెలవులు రావడంతో పాటు శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజానీకం పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణంలో వాహనాలు బారులుదీరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment