కమలం సారథిని మారుస్తారా!
ప్రస్తుత అధ్యక్షుడినే కొనసాగిస్తారా .. కొత్త వారికి అవకాశం ఇస్తారా
ఫ బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిపై
ఆసక్తికర చర్చ
ఫ పోటీలో పలువురు ఆశావహులు
ఫ అధినాయకత్వం వద్ద ప్రయత్నాలు
సాక్షి యదాద్రి : బీజేపీ జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా పాశం భాస్కర్ ఉన్నారు. అయితే అధ్యక్షుడి మార్పు అనివార్యమైతే తమకు అవకాశం ఇవ్వాలని పలువురు నాయకులు అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బూత్‌కమిటీలు, మండల అధ్యక్షులతోపాటు సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకుని అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.
భాస్కర్‌ను నియమించి ఏడాది..
పార్టీ నియమావళి ప్రకారం అధ్యక్షుడు మూడు సంవత్సరాలపాటు పదవిలో ఉంటారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియామకమైన అధ్యక్షుడు పాశం భాస్కర్ పదవీకాలం ఏడాది మాత్రమే దాటింది. ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో ఆయనే కొనసాగే అవకాశం ఉందని పార్టీ నాయకుడొకరు సాక్షితో చెప్పారు. అతను కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగేందుకు సిద్ధంగానే ఉన్నారు.
ఆశావహులు వీరే..
పాశం భాస్కర్‌ను అధ్యక్షుడిగా కొనసాగించని పక్షంలో తమకు అవకాశం కల్పించాలని పలువురు బీజేపీ నాయకులు అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రాంతాల వారీగా పోటీపడుతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, కిసాన్ మోర్చా నాయకుడు పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, పడాల శ్రీనివాస్, కడకంచి రమేష్, ఏసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చందామహేందర్‌గుప్తా, వంగేటి విజయభాస్కర్‌రెడ్డి ఇలా పలువురు నాయకులు పోటీపడుతున్నారు. పదవిని ఆశిస్తున్న మరికొందరు క్షేత్ర స్థాయిలో బూత్‌కమిటీ సభ్యులు, మండల, మున్సిపల్ కార్యవర్గ సభ్యులను మచ్చిక చేసుకుంటున్నారు. తనకు మద్దతు పలకాలని కేడర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
సంస్థాగతంగా అభిప్రాయ సేకరణ
పార్టీ రాష్ట్ర నాయకత్వం అధ్యక్షుని నియామకం విషయంలో సంస్థాగతంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది. అయితే ఆలేరు, భువనగిరి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకుంటారా.. లేక జిల్లా మొత్తంగా యూనిట్‌గా తీసుకుంటారా అనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రస్తుతం సభ్యత్యాల సేకరణ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 12 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో చేశారు. దీంతో ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 వేల సభ్యత్వం పూర్తి చేసినట్లు ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిని మరో రెండు మున్సిపాలిటీలు, ఐదు మండలాలను పరిగణలోకి తీసుకుంటే సభ్యత్వాలు బూత్ కమిటీలు, మండల కమిటీల ప్రతినిధులు సంఖ్య మరింత పెరగనుంది. వీరందరి అభిప్రాయాలు తీసుకుని తరువాత నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యడొకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment