పట్టాలెక్కని డబ్లింగ్ పనులు!
బీబీనగర్: బీబీనగర్– గుంటూరు మధ్యన డబ్లింగ్ పనులకు రైల్వేశాఖ నిధులు కేటాయించినా మోక్ష కలగడం లేదు. ఆగస్టులోనే పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా నేటికీ అడుగు ముందుకు పడలేదు. ఈ మార్గంలో డబ్లింగ్ కోసం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. బీబీనగర్– గుంటూరు డబ్లింగ్ పనుల్లో భాగంగా మొదటగా నడికుడి మార్గంలో 48 కిలో మీటర్ల మేర రూ.647 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో పాటు బీబీనగర్– గుంటూరు మధ్య రెండో లైన్ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈమేరకు 2023లో దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. దీంతో 230 కిలోమీటర్లకు పైగా నిర్మాణ వ్యయానికి రూ.2853.23 కోట్లు కేటాయించింది. దశల వారీగా పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. కేటాయించిన రూ.2853.23 కోట్లలో సివిల్ పనులకు రూ.1947.44, ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు రూ.588.17కోట్లు, సిగ్నలింగ్ టెలికాం పనులకు రూ.319.62 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. 2024 ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఆగస్టు నుంచి పనులు ప్రారంభం కావొచ్చని రైల్వే అధికారులు తెలిపినా.. ఇంత వరకు మోక్షం కలగలేదు.
అందుబాటులోకి వస్తే పెరగనున్న రద్దీ
బీబీనగర్– గుంటూరు నడికుడి రెండో లైన్ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారి రద్దీ పెరగనుంది. తిరుపతి, చైన్నె, ఖమ్మం తదితర ప్రాంతాలకు బీబీనగర్ నడికుడి గుంటూరు మార్గం ద్వారా దగ్గర కావడం, డబ్లింగ్‌తో రైల్వే వేగం పెరుగనుండడంతో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఇప్పటి వరకు గుంటూరు మార్గం సింగిల్ ట్రాక్ లైన్ కావడంతో ఒక రైలు వస్తే మరో రైలును ముందు స్టేషన్‌లో నిలిపేవారు. ఇప్పుడు రెండో లైన్ అందుబాటులోకి వచ్చాక ప్రయాణికులకు వేచి ఉండాల్సిన ఇబ్బందులు తొలగనున్నాయి.
బీబీనగర్– గుంటూరు మధ్య రెండో లైన్‌కు కలగని మోక్షం
ఫ ఏడాది క్రితమే నిధులు కేటాయించిన రైల్వే శాఖ
ఫ ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తి
ఫ ఆగస్టులో పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా జాప్యం
డబ్లింగ్ పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయి
బీబీనగర్ – నడికుడి రైలు మార్గం సింగిల్‌గా ఉండడంతో గుంటూరు వెళ్లినప్పుడల్లా పలు స్టేషన్ల వద్ద రైళ్లు ఆగడంతో వేచిఉండాల్సి వస్తోంది. ఇప్పుడు రెండో లైన్ ఏర్పాటైతే మాలాంటి ప్రయాణికులకు ఇబ్బందులు తొలగుతాయి. – వల్లపు కోటయ్య,
ప్రయాణికుడు, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment