వైఫల్యాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
● కేసీఆర్ సైన్యం తెగబడితే
బయటకు రాలేరు
● ఆలేరు నియోజకవర్గంలో పోలీస్‌స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయి
● విలేకరుల సమావేశంలో
గొంగిడి సునీత, క్యామ మల్లేష్,
కంచర్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులను ఎత్తిచూపిన ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు దాడులకు దిగడం అప్రజాస్వామికమని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుదు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఇంచార్జి క్యామ మల్లేష్ ధ్వజమెత్తారు. సోమవారం భువనగిరిలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూ కార్యకర్తల దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో తప్పులను ఎత్తిచూపే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, సమాధానం చెప్పలేక తమ పార్టీ కార్యాలయాలు, నాయకులపై దాడులకు దిగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సైన్యం 70 లక్షలు ఉందని, తాము దాడులకు తెగబడితే కాంగ్రెస్ నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. ఆలేరు నియోజకవర్గంలో పోలీస్‌స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారాయన్నారు. భూకబ్జాదారులకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. భువనగిరిలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం వల్లే శాంతిభద్రతల సమస్య తలెత్తిందన్నారు. భువనగిరి ఘటనపై సీపీ విచారణ జరిపి కారుకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పైళ్ల శేఖర్‌రెడ్డి ఏనాడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదు
భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏనాడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని, నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడ్డారని, పోలీసు యంత్రాంగానికి సహకరించారని పేర్కొన్నారు. ఆయనను విమర్శించే హక్కు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డికి లేదన్నారు. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. దాడులకు దిగితే తాము కూడా ప్రతి దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు స్వస్తి పలికి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కర్రె వెంకటయ్య, ఏనబోయిన ఆంజనేయులు, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, అజిమోద్దీన్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment