అంబరమంటిన సంబరం
చౌటుప్పల్ పట్టణంలో భోగి మంటలు వేసి కేరింతలు కొడుతున్న
మార్నింగ్ వాకర్స్, చిన్నారులు
భువనగిరి : ముంగిట్లో భోగిమంటలు.. వాకిట్లో ముగ్గులు.. పసుపుకుంకుమలు అద్దుకున్న గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. పిండివంటల ఘుమఘుమలు.. పిల్లలు, యువతుల కేరింతలు.. నింగికెగిరే పతంగులు.. ఇలా పల్లెలన్నీ సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా సోమవారం భోగి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకువజామునే భోగి మంటలు వేసి.. భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని కోరుకున్నారు. ఇంట్లో ఉన్న పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన వస్తువులు మంటల్లో వేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. పిల్లల తలపై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందజేశారు. అలాగే మంగళవారం సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
కిక్కిరిసిన బస్సులు,ఆటోలు
సంక్రాంతి నేపథ్యంలో బస్సులు, ఆటోలు ప్రయాణికులతో కిక్కిరిశాయి. జిల్లాకు చెందిన వలస కుటుంబాలు ఎక్కువగా హైదరాబాద్, సికింద్రాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వారంతా సొంత గ్రామాల్లో సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తరలిరావడంతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. బస్టాండ్ల నుంచి బస్సులు, ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు.
కులదేవతలకు భోగి బోనం
మోత్కూరు : మోత్కూరు పట్టణంలో ముది రాజ్, గౌడ కులస్తులు భోగి పండుగను వినూత్నంగా నిర్వహించారు. భోగి పండుగ రోజు తమ కులదైవాలకు బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. కాగా ముదిరాజ్ కులస్తులు పెద్ద తల్లి ఆలయానికి, గౌడ కులస్తులు కంఠ మహేశ్వర స్వామి ఆలయానికి బోనాలతో ప్రదర్శనగా వెళ్లారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి దేవతలకు బోనంను నైవేద్యంగా సమర్పించారు. శివసత్తుల పూణ కాలు, డప్పుచప్పుళ్లు మధ్య బోనాలు వేడుకలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ముది రాజ్ సొసైటీ అధ్యక్షులు మన్నె భీమయ్య, ఉపాధ్యక్షుడు మొలకల రమేష్, కార్యదర్శి కోమటి మత్స్యగిరి, యూత్ విభాగం ప్రతినిధులు కోమటి జనార్దన్, బుంగపట్ల మత్స్యగిరి, బండారు చిరంజీవి, కోమటి అజయ్‌కుమార్, బొల్లేపల్లి వీరేష్, గౌడ సొసైటీ నాయకులు బుర్ర యాదయ్య, బీసు యాదగిరి, కారుపోతుల వెంకన్న, మొరిగాల వెంకన్న, బీసు మధు, గునగంటి శ్రీధర్, బుర్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భోగి పండుగ
లోగిళ్లలో ఆకట్టుకున్న రంగవళ్లులు
హరిదాసుల సంకీర్తనలు,
డూడూ బసవన్నల విన్యాసాలు
బంధుమిత్రులు, ఆడపడుచుల
రాకతో కళకళలాడిన కుటుంబాలు
నేడు మకర సంక్రాంతి
Comments
Please login to add a commentAdd a comment