భువనగిరి టౌన్ : పట్టణంలో నిషేధిత మాంజాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తారాకరామానగర్‌లో బర్రె మధు మాంజాలు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. రెండు పెద్ద బండిల్స్, 3 చిన్న బండిల్స్ మంజాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వికసిత్ భారత్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో సత్తాచాటారు
యాదగిరిగుట్ట : ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి వికసిత్ భారత్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో తుర్కపల్లి మండలం రాంపూర్‌తండాలోని మోడల్ స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు సత్తా చాటారు. వారు రూపొందించిన చార్జింగ్ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ ప్రాజెక్టు ఉత్తమ ఎగ్జిబిట్‌గా ఎంపికై ంది. విద్యార్థులు లూనావత్ అఖిల్, భానోతు తరుణ్‌ను పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
పెద్దగట్టు ఆలయ కమిటీ సభ్యుల నియామకం
చివ్వెంల: రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన చివ్వెంల మండలం దురాజ్‌పల్లి శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) ఆలయ నూతన కమిటీని దేవాదాయ శాఖ సోమవారం ప్రకటించింది. సభ్యులుగా సూర్యాపేట పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది పోలెబోయిన నర్సయ్య యాదవ్, పోలెబోయిన నరేష్ పిళ్లే, వట్టిఖమ్మంపహాడ్ గ్రామానికి చెందిన వీరబోయిన సైదులు యాదవ్, సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్న మల్లయ్య, ఖాసీంపేట గ్రామానికి చెందిన సిరపంగి సైదమ్మ నియమితులయ్యారని పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ వద్ద సమావేశం నిర్వహించి చైర్మన్ ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కాగా సీనియర్ న్యాయవాది పోలెబోయిన నర్సయ్య చైర్మన్‌గా ఎంపిక కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మంత్రి కోమటిరెడ్డి
సంక్రాంతి శుభాకాంక్షలు
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సూచించారు. తెలంగాణలో సంక్షేమం, సుపరిపాలన ప్రగతిపథంలో ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలంతా సంబురంగా సంక్రాంతిని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
భువనగిరిటౌన్ : దేశంలో రోజురోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ పేర్కొన్నారు. సోమవారం భువనగిరిలోని హనుమాన్‌వాడలో ఎస్‌ఎఫ్‌ఐ,డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. నిర్భయ, దిశ చట్టాలను పకడ్బందీగా అమలయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బర్ల వెంకటేశం, ఆరే విజయ్, నాయకులు అజయ్, నిర్వాహకులు కొలుపుల శ్రీనిజ, నిఖిల్, సహన, నాగేశ్వరి, సింధుజ తదితరులు పాల్గొన్నారు.
రాజమాత ఫౌండేషన్
సంస్థ సభ్యులకు డాక్టరేట్
మోత్కూరు : మండలంలోని పాటిమట్లకు చెందిన రాజమాత ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సహారా చారిట్రబుల్ ట్రస్టు డాక్టరేట్ ప్రకటించింది. ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు ఉదయ్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మనోజ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి సంస్థకు చెందిన ఐదుగురు సభ్యులకు డాక్టరేట్ ప్రకటించినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment