హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

Published Sun, Dec 3 2023 12:52 AM | Last Updated on Sun, Dec 3 2023 9:19 AM

అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు    - Sakshi

అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు

ప్రొద్దుటూరు క్రైం : హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉండి 35 రోజుల నుంచి పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ తప్పించుకొని తిరుగుతున్న భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉన్న మల్లేలమ్మ గుడి వద్ద అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రెండు బైక్‌లు, ఐదు సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. అక్టోబర్‌ 28న వైఎస్సార్‌సీపీ కార్యకర్త బెనర్జీని చంపాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగింది.

బెనర్జీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అలాగే భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకై న పాత్ర పోషించేవారు. గతంలో టీడీపీకి చెందిన నందం సుబ్బయ్య హత్య కేసులో బెనర్జీ ముద్దాయిగా ఉన్నాడు. అప్పటి నుంచి వీరి మధ్య వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విరోధం ఉండేది. తరచూ వాగ్వాదం, తగవులు కొనసాగుతూ వీరి మధ్య ఉన్న మనస్పర్థలు తారాస్థాయికి చేరాయి. ఈ విషయాలన్నీ భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి చెప్పేవారు. సరైన అవకాశం కోసం వేచి ఉన్న ముగ్గురు బెనర్జీని మట్టు పెట్టేందుకు వ్యూహ రచన చేశారు. అక్టోబర్‌ 28న వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రొద్దుటూరులో సామాజిక సాధికార యాత్ర పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు.

ఆ రోజు బెనర్జీ పార్టీ కార్యక్రమంలో బిజీగా ఉంటాడని.. అతన్ని మట్టు పెట్టేందుకు ఇదే సరైన సమయమని వారు పథకం రచించారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు బైక్‌లో వెళ్తున్న బెనర్జీని భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు తమ బైక్‌తో ఢీ కొట్టారు. అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పక్కనే టెంకాయల బండిపై ఉన్న కత్తితో బెనర్జీని నడిరోడ్డులో విచక్షణారహితంగా నరికారు. పోలీసులు రావడంతో సంఘటనా స్థలం నుంచి నిందితులిద్దరూ పారిపోయారు. అప్పటి నుంచి వారు పోలీసులకు దొరక కుండా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను కొర్రపాడు రోడ్డులోని మల్లేలమ్మ గుడి వద్ద త్రీ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటార్‌ బైక్‌లు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

సహకరించిన వారి పాత్రపై విచారణ
హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న నిందితులిద్దరికీ సహకారాలు అందించిన వారిని కూడా విచారణ చేస్తామని డీఎస్పీ తెలిపారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, కొత్త సిమ్‌ కార్డుల ద్వారా భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు స్థానికంగా ఏం జరుగుతుందనే సమాచారాన్ని తెలుసుకునేవారు. పరారీలో ఉన్న నిందితులకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటికి చెందిన సిద్ధారెడ్డితో పాటు ఇంకా కొంత మంది ఆర్థిక సాయంతో వాహనాలను సమకూర్చారన్నారు. వాళ్లు ఉండేందుకు వసతి ఏర్పాట్లు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నేరం చేసిన ముద్దాయిలకు సహకరించడం కూడా నేరం అవుతుందన్నారు, ఈ విషయం తెలిసి కూడా నిందితులకు వీరు సహకారం అందించినట్లు తమ విచారణలో నిర్ధారణ అయిందని చెప్పారు. విచారణ అనంతరం సహకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. కాగా ఈ కేసులో టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నవంబర్‌ 13న త్రీ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కడప సెంట్రల్‌ జైల్లో ఉన్న ఆయన 21న బెయిల్‌పై విడుదలయ్యారు.

నిందితుల కోసం 35 రోజులు శ్రమించిన పోలీసులు
బెనర్జీపై హత్యాయత్నం చేసిన కేసులో పరారీలో ఉన్న భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిల కోసం పోలీసులు 35 రోజుల పాటు శ్రమించారు. ఏపీతో పాటు తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల్లో నిందితులిద్దరూ తలదాచుకుంటూ వచ్చారు. వీళ్లు బస చేసిన ప్రాంతాల్లో కూడా విచారణ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులోని నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన త్రీ టౌన్‌ సీఐ వెంకటరమణ, ఇతర సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement