●అర్థరాత్రి నుంచి తెల్లవారుజామువరకు
● అర్ధరాత్రిళ్లు, తెల్లవారుజామున ఇష్టానుసారంగా ఇసుక తరలింపు
● పదులసంఖ్యలో పట్టుబడుతున్న వాహనాలు
● జిల్లా నుంచి బెంగళూరుకు తరలించేందుకు ప్రణాళిక
సాక్షి రాయచోటి: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడిని కూటమి నేతలు బాగా ఒంట బట్టించుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడే అక్రమంగానైనా సరే ఆర్థికంగా బలపడాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే దోపి డీకి తెర తీస్తున్నారు. ఇటీవల జరిగిన మద్యం టెండర్లలో మొదలు ఇసుక వ్యవహారం దాకా వ్యూహం ప్రకారం ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణాలో చెలరేగిపోతున్నారు. దీని కి తోడు ‘ఉచిత ఇసుక’ను వరంగా మార్చుకున్నా రు. అవును.. ఉచిత ఇసుక పేరుతో రాత్రికి రాత్రే....తెల్లవారుజామున నదుల నుంచి జేసీబీలు పెట్టి టిప్పర్లతో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాలో నాలుగైదు స్టాక్ పాయింట్లు ఉన్నా అవి కూడా టీడీపీ వారికే దక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రత్యేకంగా టిప్పర్లను పెట్టుకుని ఇసుక వ్యాపారం సాగిస్తుండడం గమనార్హం.
తిరగబడుతున్న జనం
ఇసుక అక్రమ రవాణాను రాత్రిళ్లు ఎడతెరిపి లేకుండా తరలిస్తుండడంతో గ్రామస్తులు తిరగబడుతున్నారు. 15 రోజుల కిందట పెనగలూరు మండల పరిఽధిలోని నారాయణ నెల్లూరు గ్రామస్తులు తిరగబడి టిప్పర్లను కూడా అధికారులకు పట్టించారు. తర్వాత చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఇసుక కోసం ఎవరూ రావద్దని హెచ్చరికలు చేశారు. అలాగే వైఎస్సార్ జిల్లాల వేంపల్లె పరిధిలోని పాపాఘ్ని నది నుంచి ఇష్టానుసారంగా ఇసుకను తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతాయని జనం రోడ్డుపైకి వచ్చారు. అంతేకాకుండా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవితకు కూడా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని విన్నవించారు. సిద్దవటం మండల పరిధిలోని జంగాలపల్లె వద్దగల నదిలోకి ఎవరూ రాకుండా చుట్టూ గుంతలు తీశారు. ఇలా ఇక్కడే కాదు....అనేక చోట్ల జనాలు ఇసుక వ్యవహారంపై చైతన్యవంతులై అడ్డుకుంటున్నారు. జనం తిరగబడుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు సైతం అక్రమార్కులపై దృష్టి సారిస్తే అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా అధికారులు దృష్టిసారించి అడ్డుకట్ట వేస్తారో... అమ్ముడుపోయి అక్రమాలకు వంత పాడుతారో.. అంతా వారి చేతుల్లోనే ఉంది.
పట్టుబడినా... తగ్గని అక్రమ రవాణా
ఇటీవల అధికారులు దాడులు చేసి వాహనాలను సీజ్ చేయడంతోపాటు జరిమానా విధించినా అక్రమ వ్యవహారాలు ఆగడం లేదు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే నందలూరులో రెండుమార్లు జేసీబీలతోపాటు టిప్పర్లు పట్టుబడ్డాయి. నాలుగు రోజుల కిందట ఒంటిమిట్టలో కూడా సుమారు 10 ట్రాక్టర్ల వరకు పట్టుబడ్డాయి. అంతకుముందుపు కూడా ఒంటిమిట్టలో భారీగా టిప్పర్లను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు పరిధిలోని చౌడూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా అధికారులు దాడులు నిర్వహించి ఇసుక వాహనాలను పట్టుకున్న ఘటనలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన వారి వాహనాలు కావడంతో పెద్దల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా అధికారులు ఇక పగలు నిఘా ఉంచి రాత్రి సమయంలో చేతులెత్తేస్తున్నారు. ఇదే అదునుగా ఇసుకాసురులు జోరు పెంచారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని చెయ్యేరు, పాపాగ్ని, పెన్నా, బాహుదా, మాండవ్య, పెద్దేరు తదితర నదుల్లో ఎక్కడ పడితే అక్కడ అవకాశం ఉన్న మేరకు నదులను చెరబడుతున్నారు.
వైఎస్సార్ జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలో అర్థరాత్రి మొదలుకొని తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పగలైతే కెమెరాలు...అధికారుల కళ్ల బడతామని రాత్రికి రాత్రే ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. కొంతమంది వరుసబెట్టి ట్రాక్టర్లతో తరలిస్తుండగా మరికొన్నిచోట్ల ప్రొక్లెయిన్లు పెట్టి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇదేమని అడిగే ‘మా ఇష్టం..మా ప్రభుత్వమం’టూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇసుకను స్థానికంగా డిమాండును బట్టి అందించడం, ముందుగా చేసుకున్న ఒప్పందాల మేరకు బయటి ప్రాంతాలు, రాష్ట్రాలకు సరిహద్దులు దాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment