ప్రకృతి విస్తరణకు ప్రణాళిక
సాగు ఖర్చు సగానికి తగ్గింది...
1.5 ఎకరాల్లో చామంతిపూలు సాగు చేశా. సాధారణ పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు రూ. 90 వేలు ఖర్చు వస్తుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతి వల్ల రూ. 45 వేలే ఖర్చు అయింది. ఈ పద్ధతిలో పండించడం వల్ల పూలు నాణ్యంగా ఉంటున్నాయి. – సులోచన, రైతు, పెండ్లిమర్రి
కడప అగ్రికల్చర్: రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా ప్రకృతిలో లభించే సహజ సిద్ధమెన పదార్థాలతో తయారు చేసుకున్న జీవామృతం, కషాయాల వాడకంతో నిర్వహించేదే ప్రకృతి వ్యవసాయం. భూమి ఉన్న రైతులతోపాటు భూమి లేని వారు సైతం తమ ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో కిచెన్‌గార్డెన్ వంటి వాటిని ఏర్పాటు చేసుకుని ఆరోగ్యకరమైన కూరగాయలను పండించి వారు తినడంతోపాటు అందరికి అందించాలనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రకృతి వ్యవసాయాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తరింప చేయాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయ అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రకృతి వ్యవసాయం 80 శాతం మేర పెంచే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా జిల్లాలోని పెండ్లిమర్రిని మోడల్ మండలంగా ఎంపిక చేశారు. ఈ మండలంలో 2027–28 సంవత్సరానికి 80 శాతం మేర ప్రకృతి వ్యవసాయసాగు విస్తరించే విధంగా చర్యలు చేపట్టారు.
పెండ్లిమర్రి మండలంలో 13 పంచాయతీల్లో...
పెండ్లిమర్రి మండలంలో 19 గ్రామ పంచాయతీలకు 13 గ్రామ పంచాయతీలైన చీమలపెంట, చెర్లోపల్లి, ఇసుకపల్లి, గంగిరెడ్డిపల్లె, గొందిపల్లి, కొత్త గిరియాంపల్లి, నాగాయపల్లి, నందిమండలం, పెండ్లిమర్రి, సంగటపల్లి, తిప్పిరెడ్డిపల్లె, తుమ్మలూరు, ఎల్లటూరులో అందుకు తగ్గ కార్యచరణను ప్రారంభించారు. ఈ పంచాయతీల్లోని గ్రామాల్లో ఉన్న డ్వాక్రా మహిళా సంఘాలు, గ్రామ సమాఖ్యలతోపాటు మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై సదస్సులను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. 2024–25 ఏడాదికి ప్రకృతి వ్యవసాయ పంటల సాగు కోసం 2957 మంది రైతులను గుర్తించాల్సి ఉండగా ఇప్పటికి 1412 మందిని గుర్తించారు. వీరంతా ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు సాగు చేసేలా చైతన్యం కల్పించారు. అలాగే ఈ పద్ధతిలో పండించే పంటల దిగుబడులను అదే మండలంలో ఆమ్ముకునే విధంగా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డీఆర్‌డీఏ సహకారంతో చిన్న తరహా కుటీర పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
ప్రతి సంఘం నుంచి ఇద్దరు ఎంపిక
ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్రతి మహిళా సంఘం నుంచి ఇద్దరు లీడ్ ఫార్మర్స్‌ను ఎంపిక చేసి వారికి ఐసీఆర్‌సీ ద్వారా అవగాహన కల్పిస్తూ సాగును ప్రారంభిస్తారు. వారు మిగతా గ్రూపు సభ్యులకు కషాయాలు, ద్రావణాల తయారీపై శిక్షణ ఇస్తారు. ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన కల్పిస్తారు. 2027–28 నాటికి మండలవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింప చేయాలనే లక్ష్యంతో సాగుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
పెండ్లిమర్రి మండలంలోని 13 గ్రామ పంచాయితీల్లో ప్రకృతి వ్య వసాయాన్ని ప్రారంభించాం.దీనిపై గ్రామాల్లోని డ్వాక్రా, గ్రామ సమాఖ్య మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం.
– సందీప్, పెండ్లిమర్రి మండల టీమ్ లీడర్
●పౌష్టికాహారం అందించేందుకు..
లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి
రబీ సీజన్‌కు సంబంధింది 27850 మంది రైతుల ద్వారా 32522 ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టకున్నాము. లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నాం. మోడల్‌గా ఎంపిక చేసిన పెండ్లిమర్రిలో సాగు పెంచేందుకు చర్యలు చేపట్టాం.
–ప్రవీణ్‌కుమార్,డీపీఎం, ప్రకృతి వ్యవసాయం
ప్రతి మండలంలో 80 శాతం మేర ప్రకృతి సేద్యం సాగుకు చర్యలు
పెండ్లిమర్రి మండలం మోడల్‌గా ఎంపిక
మహిళా సంఘాలకు మొదలైనఅవగాహన సదస్సులు
ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా పండించే ఉత్పత్తులను అందించేందుకు 13 గ్రామ పంచాయతీల్లో ఎంతమంది గర్భిణులు ఉన్నారు.రక్తహీనత మహిళలు, బాలింతలు, చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారనే వివరాలను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సేకరించారు.ముందుగా ఐదు పంచాయతీల్లో సర్వే నిర్వహించారు. వీటిల్లో 20 మంది గర్భిణులు, 6 నెలల నుంచి రెండు సంవత్సరాల వయస్సు ఉన్న 78 మంది పిల్లలు, అలాగే 3 నుంచి 6 సంవత్సరాలుండే 138 మంది పిల్లలు ఉన్నట తెలిపారు. వీరికి ప్రకృతి సేద్యం ద్వారా పండించిన చిరుధాన్యాల ఉత్పత్తులను అందించి రక్తహీనతను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్(పీజీఎస్) సర్టి ఫికెట్ ద్వారా బహిరంగ మార్కెట్ కంటే 10 శాతం అధిక రేటుతో అమ్ముకునేందుకు వీలుగా అధికారులు కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment