కొండలు.. కొల్లగొట్టేస్తున్నారు
ప్రభుత్వ భూమిలో మట్టి తరలిస్తున్న అధికారపార్టీ నాయకులు
బ్రహ్మంగారిమఠం: కొండలు, రాళ్ల గుట్టలు, ప్రభుత్వ భూములు ఇలా ఏవి కనబడితే అవి కొల్లగొట్టేస్తున్నారు.. కొందరు అక్రమార్కులు. అధికార పార్టీ నేతల అండతో మట్టిని తవ్వి తరలిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో రెవెన్యూ శాఖలో లక్షల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. మండలంలోని తోట్లపల్లె అచలానంద ఆశ్రమం సమీపంలో చెరువు అలుగు వంక వద్ద తోట్లపల్లె ఎస్సీలకు చెందిన తొమ్మిది ఎకరాల భూములు ఇటీవల స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారపార్టీ నాయకులు కలిసి కొనుగోలు చేశారు. ఎకరా పొలం దాదాపు రూ 43 లక్షలు పలికింది. ఈ పొలం రోడ్డుకు కింది భాగంలో ఉండడంతో చదును చేయాలనుకున్నారు. పలుగు రాళ్లపల్లె పార్టు–4లో భూములపై కన్నేశారు. సర్వేనెంబర్ 2080–1 94 సెంట్ల రాళ్లగుట్ట, 2080లో 16 సెంట్ల వాగు, 2082లో 2.25 ఎకరాల భూములు రెవెన్యూ ఆధీనంలో ఉన్నాయి. వీటి పక్కన భూములు కొన్న వ్యాపారులు అక్కడ చదును చేసేందుకు గుట్టలను సైతం పిండి చేస్తున్నారు. రెండు ఇటాచీలు తెప్పించి ప్రభుత్వ భూముల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిస్తున్నా గ్రామ నౌకర్, వీఆర్వోలు కన్నెత్తి చూడడం లేదు. రెవిన్యూ అదాయానికి గండి కొడుతూ.. చిన్న కొండలు పిండి చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వానికి నష్టం కల్గిస్తే చర్యలు
తోట్లపల్లె వద్ద ఎస్సీలకు చెందిన పట్టా భూములను కొందరు కొన్న మాట వాస్తవం. ఆ భూముల చదునుకు రెవిన్యూ ఆధీనంలో ఉన్న చిన్న కొండలనుంచి మట్టి తరలిస్తున్నట్లు నాకు ఎవరూ తెలియజేయలేదు. సమాచారం ఇస్తే మట్టి తరలింపు నిలిపివేస్తాం. ప్రభుత్వానికి నష్టం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం. – దామోదర్‌రెడ్డి, తహసీల్దారు
Comments
Please login to add a commentAdd a comment