అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు
కడప కార్పొరేషన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్‌పై, వైఎస్సార్‌సీపీ నాయకులపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తూ 7 నెలల కాలం గడిపేశారని, అప్పులు తప్ప చేసిందేమీ లేదన్నారు. వరదలు, టీటీటీ లడ్డు, వైఎస్ జగన్ కుటుంబ కలహాలు వంటి అంశాలను రాజకీయాలకు ఉపయోగించుకున్నారన్నారు. ఇప్పుడు ఆదానీతో ఒప్పందాలు అంటూ కొత్త కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో డిస్కంలకు రూ.13వేల కోట్లు ఇస్తే, వైఎస్ జగన్ తన పాలనలో రూ.47వేల కోట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మిస్తే...వైఎస్ జగన్ దూరదృష్టితో తీరప్రాంతంలో ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి చేయడానికి కృషి చేశారన్నారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో ఒప్పందం చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు రద్దు చేసిన తర్వాతే ఆ ఒప్పందం కూడా చేసుకున్నారని తెలిపారు. సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అన్ని సంస్థలతో సెకీ ఒప్పందాలు చేసుకుందని, అందులో అదానీ గ్రూప్ కూడా ఉందన్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం సోలార్ పవర్‌ను రూ.5.90లతో, విండ్ పవర్‌ను రూ.4.63లతో కొనుగోలు చేసేందుకు 25 ఏళ్లకు ఒప్పందం చేసుకుందని, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కేవలం రూ.2.49లకే కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు.సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, బీహెచ్ ఇలియాస్, శ్రీరంజన్‌రెడ్డి, త్యాగరాజు, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment