మహా విష్ణువుకు ఇష్టం.. మార్గశిర మాసం
నేటి నుంచి ప్రారంభం
కడప కల్చరల్ : మార్గశిరం.. మహా విష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. వైష్ణవులకు ముక్తిదాయకమైన మాసం.. వరుస పర్వదినాలతో అధిక పుణ్యం సంపాదించుకునే మార్గం.. మార్గశిరమాసం.. ఈ మాసం, ఈ సందర్భంగా వచ్చే పర్వదినాలు, నిర్వహించే పూజల గురించిన వివరాలు..
అన్ని మాసాలలో మార్గశిరం తనకెంతో ఇష్టమైనదని మహావిష్ణువు స్వయంగా చెప్పినట్లు పౌరాణికులు చెబుతుంటారు. ఇతర మాసాలన్నింటికంటే ఈ మాసం వైష్ణవులకు అత్యంత పుణ్యదాయకమని భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే పలు పర్వదినాల్లో చేసే పూజలు తమకెంతో పుణ్యాన్ని ఇస్తాయన్నది వారి విశ్వాసం.
కార్తీక మాసపు అమావాస్య తర్వాతి రోజు సోమవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభం కానుంది. ఇది హేమంతంలో వచ్చే మొదటి నెల. సౌరమానం ప్రకారం ధనుర్మాసం, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసం వస్తాయి. ఈ మాసంలో భక్తులు ఎక్కువ సమయం ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ప్రకృతి కూడా మనోహరంగా కనువిందు చేస్తూ ఉంటుంది. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చింది గనుక దీన్ని మార్గశిరమాసమని పేర్కొంటారు. ఈ మాసంలో ఏ పూజచేసినా అధిక పుణ్యం లభిస్తుందని పెద్దలు పేర్కొంటారు.
మార్గశిరంలో పర్వదినాలు
ఈ మాసంలో శివ పుత్రుడు సుబ్రమణ్యస్వామికి సంబంధించిన సుబ్రమణ్యషష్ఠి పండుగను ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రమణ్యషష్ఠిగా కుమారస్వామికి పూజలు నిర్వహిస్తారు. ఫలితంగా యోగా, ఆరోగ్యబలం చేకూరుతాయని భక్తుల్లో విశ్వాసం ఉంది. శుక్లపక్ష సప్తమి నాడు లోకమిత్రుడు, ప్రత్యక్ష నారాయణుని ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఆరోజున దినకరుని పూజ ఆరోగ్యాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు గీతా జయంతి వస్తుంది. ఈ సందర్భంగా విశ్వమానవాళికి ఉత్తమ మార్గదర్శనం చేసే జ్ఞాన గ్రంథం భగవద్గీత పారాయణం పుణ్యదాయకమని పేర్కొంటారు.
శుక్ల ద్వాదశి నాడు మహా విష్ణువుకు సంబంధించిన వ్రతాలు, త్రయోదశి నాడు అంజనీపుత్రుడు హనుమంతుని పేరిట వ్రతాలు నిర్వహిస్తారు. ఈ పూజల ద్వారా దుష్ట గ్రహాల నుంచి వచ్చే బాధలు తొలగిపోతాయన్న నమ్మకం ఉంది. ఈ మాసంలోనే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినంత వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెలలో కాలభైరవాష్టమి కూడా వస్తుంది. ఆరోజున నిర్వహించే పూజలు ఆరోగ్యదాయకమంటారు. మార్గశిర శుద్ధ పౌర్ణమినాడు దత్తాత్రేయ జయంతి నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment