మాజీ కౌన్సిలర్ తమ్ముడిపై టీడీపీ కౌన్సిలర్ దాడి
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని టీడీపీ కౌన్సిలర్ మునీర్, అతని అనుచరులు ఓ మాజీ కౌన్సిలర్ తమ్ముడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నడిరోడ్డులో కౌన్సిలర్ అనుచరులు కట్టెలతో దాడికి పాల్పడ్డారు. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షేక్ మహమ్మద్‌హుసేన్ గ్రీన్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. తన అన్న మాజీ కౌన్సిలర్ అయిన జిలాన్‌బాషాకు 19వ వార్డు కౌన్సిలర్ మునీర్ తమ్ముడు బషీర్ కొంత డబ్బు బాకీ ఉన్నాడు. డబ్బు విషయమై వారి మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 23న రాత్రి డబ్బు విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై 24న రూరల్ పోలీస్ స్టేషన్‌లో మునీర్ ఫిర్యాదు మేరకు మహమ్మద్‌హుసేన్, అతని అన్న జిలాన్‌బాషాపై కేసు నమోదైంది. ఇదే ఘటనకు సంబంధించి మహమ్మద్‌హుసేన్ కూడా మునీర్‌పై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం మధ్యాహ్నం సమయంలో మహమ్మద్ హుసేన్ జిన్నా రోడ్డులో నిలబడి ఉండగా కౌన్సిలర్ మునీర్, తమ్ముడు బషీర్, అస్లాం, మాబుహుసేన్, సలీంతో పాటు మరికొందరు బొలెరో వాహనంలో వచ్చి కట్టెలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహమ్మద్‌హుసేన్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అతన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ యుగంధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment