జగన్ కృషితోనే ముంపు నుంచి బయటపడిన కడప
కడప కార్పొరేషన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన నిధుల వల్లే కడప నగరం ముంపు బారి నుంచి గట్టెక్కిందని 14వ డివిజన్ కార్పొరేటర్ కె.బాబు అన్నారు. మంగళవారం స్థానికులతో కలిసి ప్రకాష్‌నగర్‌లో వరదనీటి కాలువ సగానికిపైగా పూర్తయిన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే కడపలో చాలా ప్రాంతాలు మునిగే పరిస్థితి ఉండేదని, నగర నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండు చుట్టు పక్కల వర్షపునీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేదన్నారు. ఈ పరిస్థితిని మేయర్ సురేష్‌బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అప్పటి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకుపోవడంతో.. ఆయన వెంటనే స్పందించి మాసాపేటలో వినియోగించాల్సిన రూ.69 కోట్లను వరదనీటి కాలువల నిర్మాణానికి ఉపయోగించాలని ఆదేశించారన్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండు నుంచి కోటిరెడ్డి సర్కిల్ మీదుగా బుగ్గవంక, గురుకుల్ విద్యాపీఠ్ నుంచి ముత్రాసుపల్లె మీదుగా చిన్నచౌకు పోలీస్‌స్టేషన్, ప్రకాష్‌నగర్– ఆర్టీసీ బస్టాండు, ఎస్‌బీఐ కాలనీ– బిల్టప్ వంటి చోట్ల వరదనీటి కాలువల నిర్మాణం చేపట్టి దాదాపు పూర్తి చేశారన్నారు. అరకొరగా మిగిలిన పనులు ఇప్పుడు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్, వేణుగోపాల్ నాయక్, త్యాగరాజు, వెంకటేశ్వర్లు, షఫీ, కంచుపాటి బాబు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలు
మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment