![సామాజిక సేవలో ముందుంటాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11klp01-170028_mr-1739334051-0.jpg.webp?itok=BZtaLBNC)
సామాజిక సేవలో ముందుంటాం
కమలాపురం : తమ పరిశ్రమ కేవలం వ్యాపార ధోరణిలో మాత్రమే కాకుండా.. సామాజిక సేవలో సైతం ముందు ఉంటుందని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్(బీసీసీపీఎల్) సీఎంఓ సాయి రమేష్ తెలిపారు. ఎర్రగుడిపాడులో ఆధునికీకరించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన మంగళవారం ఐసీడీఎస్ పీడీ శ్రీ లక్ష్మీతో కలసి ప్రారంభించారు. అలాగే సీహెచ్‌ఎఫ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశ్రమ సీఎస్‌ఆర్ నిధులతో కమలాపురం పట్టణంలోని 14వ వార్డు 4వ సెంటర్, 2వ వార్డు అంగన్వాడీ కేంద్రాలను సైతం పరిశ్రమ ప్రతినిధులతో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ భారతి సిమెంట్స్ పరిశ్రమ కేవలం వ్యాపారం మాత్రమే చేయడం లేదన్నారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మరుగు దొడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, బస్ షెల్టర్లు, విద్యార్థుల విద్యాభివృద్ధికి అనేక వసతులు కల్పించామన్నారు. అలాగే స్కిల్ ట్రైనింగ్ సెంటర్, డయాలసిస్ సెంటర్ తదితరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం చిన్న పిల్లల అంగన్వాడీ సెంటర్లలో అన్ని వసతులు సమకూరుస్తున్నామన్నారు. ప్రస్తుతం 4 సెంటర్లలో పనులు పూర్తి అయ్యాయని, మరికొన్ని సెంటర్లు పూర్తి కావాల్సి ఉందన్నారు. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేసి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతోపాటు వాల్ రైటింగ్స్, ప్లే కిట్స్ అందించిన భారతి సిమెంట్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీపీఎల్ ఐఆర్‌అండ్‌పీఆర్ హెచ్‌ఓడీ భార్గవ్‌రెడ్డి, సీఎస్‌ఆర్ హెచ్‌ఓఆర్ నితీష్ కుమార్, సీహెచ్‌ఎఫ్ ఇండియా ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్ర శేఖర్, మదన్, అంజిబాబు, సీడీపీఓ సుజామణి, సూపర్ వైజర్లు, జయ కుమారి, భారతి, వెంకట సుబ్బమ్మ, అంగన్వాడీ వర్కర్లు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.
భారతి సిమెంట్స్ సీఎంఓ సాయి రమేష్
Comments
Please login to add a commentAdd a comment