![చోరీ కేసు ఛేదన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11kdp854-170069_mr-1739334050-0.jpg.webp?itok=r7keTD2I)
చోరీ కేసు ఛేదన
అట్లూరు : మండలంలోని ఎగువపల్లి కాలనీలో గతేడాది డిసెంబర్ 6న జరిగిన చోరీ కేసుకు సంబంధించి రికవరీ చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అట్లూరు పునరావాస కాలనీలోని ఎగువపల్లి కాలనీలో చెల్లాకొండయ్య ఇంటిలో డిసెంబర్ 6వ తేదీన చోరీ జరిగిందని పేర్కొన్నారు. అదే రోజు చెల్లాకొండయ్య పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు చెప్పారు. కొండయ్య సమీప బంధువైన మైనర్ బాలుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని, చోరీకి గురైన 6 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపడం జరిగిందని తెలిపారు.
ఇంటింటా న్యాయ ప్రచారం
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్‌జడ్డి బాబా ఫకృద్దీన్ సూచనల మేరకు మంగళవారం కడప నగరం హసింగ్‌బోర్డు కాలనీలో ఇంటింటా న్యాయ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 5622 గృహాలను సందర్శించి 94 మంది ఎదుగుదల లోపాలు ఉన్న పిల్లలను గుర్తించి నివారణ కోసం సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 46 టీములు ఏర్పాటు చేయగా, ఒక్కొక్క టీంలో ఒక ప్యానల్ న్యాయవాది, ఒక పారా లీగల్ వలంటరీ, ఒక ఏఎన్‌ఎం, ఒక ఆశా వర్కర్, ఒక అంగన్వాడీ వర్కర్, ఒక వైద్యాధికారి, భవితా సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. అలాగే బృందాలు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా), బాలల సంరక్షణ కోసం స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం–2024, వికలాంగుల హక్కుల చట్టం 2016, మానసిక ఆరోగ్యం సంరక్షణ చట్టం 2017, జాతీయ మానసిక ఆరోగ్య విధానం 2014, బాల్య వివాహాలు, లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నంబర్ 15100, చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, దివ్యాంగజన్ హెల్ప్‌లైన్ నంబర్ 14456, ఉచిత న్యాయ సాయం మొదలగు అంశాలను వివరించారు. ఎదుగుదలలో లోపాలుగల చిన్నారులను కడప, ప్రొద్దుటూరులో గల జిల్లా సత్వర చికిత్స కేంద్రం లేదా జిల్లా బాల భవిత కేంద్రంలో సంప్రదించాలని తెలియజేసి తగు సూచనలు ఇచ్చారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప వారి దృష్టికి తీసుకుని రావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వలంటరీలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, వైద్యాధికారులు, భవితా సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment