Wellness
-
హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి..
నోట్లో ఉన్న ఆహారాన్ని నమిలాక మింగివేసే ప్రక్రియ చాలా సులువుగా జరుగుతున్నట్లు అనిపిస్తుందిగానీ, నిజానికి ఇదొక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో నోరు, జీర్ణవ్యవస్థ తాలూకు కండరాలూ, నరాలు ఇవన్నీ పాలుపంచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని అంతరాయాలూ, అవాంతరాలతో గుటక వేసే ఈ ప్రక్రియ కష్టమవుతుంది. ఇలా మింగడం కష్టమయ్యే కండిషన్‌ను ‘డిస్ఫేజియా’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి పరిష్కారాలేమిటి అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుటక వేసే ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ఓరల్ ఫేజ్.. ఓరల్ ఫేజ్‌లో నోట్లో ఆహారాన్ని నమలడం లేదా చప్పరించడం జరుగుతుంది. అలా ఆహారాన్ని గొంతులోకి పంపడానికి సిద్ధం చేసే దశ వరకు ఓరల్ ఫేజ్ అంటారు. ఇందులో నోరు, నాలుక, పెదవులు, దంతాలు పాలుపంచుకుంటాయి. ∙ఇక ఫ్యారింజియల్ ఫేజ్ అంటే... తిన్నది కాస్తా గొంతు దగ్గర్నుంచి ఆహార నాళంలోకి చేరే దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ పొర విండ్ పైప్‌ను మూసుకుపోవడం వల్ల ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోకే వెళ్తుంది. ∙ఈసోఫేజియల్ ఫేజ్ దశలో ఆహారం ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా ఆహారనాళంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కడుపులోకి వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మింగడం అనేది చాలా సులువుగా మన ప్రమేయం లేనట్టుగా జరిగినట్లు అనిపించినా, నిజానికి మింగడం అన్నది మన సంకల్పంతోనే జరుగుతుంది. గుటక వేయడంలో సమస్యలూ... కారణాలు ఫ్యారింజియల్ ఫేజ్.. గుటక వేసే దశలైన ఓరల్, ఫ్యారింజియల్, ఈసోఫేజియల్ దశల్లో ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా మింగడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డిస్ఫేజియా’ అంటారు. ఒక్కోసారి జీర్ణ వ్యవస్థను నియంత్రించే నరాల సమస్య వల్ల కూడా గుటక వేయడం సాధ్యం కాకపోవచ్చు. గుటక వేయలేకపోడానికి మరికొన్ని కారణాలు.. ఈసోఫేజియల్ ఫేజ్.. మరీ చిన్న పిల్లల్లో... తల్లిపాలు తాగడంలో ఇబ్బందులు, మరికాస్త పెద్ద పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో శరీరాన్ని బిగబట్టడం; నమలలేకపోవడం, తినడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. తినే సమయంలో దగ్గు రావడం లేదా పొలమారడం ∙తరచూ వాంతులు చేసుకోవడం ∙నోటి నుంచి ముక్కు నుంచి చొల్లు కారడం ∙గాలి తీసుకోవడానికీ, తినడానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం తరచూ నెమ్ము లేదా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడటం ∙గొంతు గరుకుగా మారడం లేదా గొంతులోంచి గాలి రావడం ఇక పెద్దవయసువారిలో.. తల, మెడ, ఆహార వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థలో కండరాలూ, వాటిని నియంత్రించే నరాల సమస్యతో మింగడం కష్టం కావచ్చు. ఇందుకు దారితీసే పరిస్థితుల్లో కొన్ని.. గొంతు లేదా తల భాగంలో దెబ్బ తగలడం మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు వెన్నుపూసకు గాయం కావడం అల్జైమర్స్ మతిమరపుతో గుటకవేయలేకపోవడం మల్టిపుల్ స్కి›్లరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్, వయసు పైబడటంతో వచ్చే సమస్యలు గొంతు లేదా తలకు సంబంధించిన క్యాన్సర్‌తో మింగలేకపోవడం కొన్ని రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల మింగలేకపోవడం కారణమేదైనప్పటికీ గుటక వేయలేని పరిస్థితితో పాటు నోటి నుంచి అదేపనిగా చొల్లు కారడం, తినేటప్పుడు విపరీతంగా దగ్గురావడం, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు.. బాధితుల లక్షణాలను బట్టి.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన పరీక్షలు; నోటి పరీక్షలు, స్వరపేటికకు సంబంధించిన పరీక్షలు; నరాలకు సంబంధించిన లోపాలను తెలుసుకోడానికి సీటీ స్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై హెడ్ అండ్ నెక్ వంటి పరీక్షలు అవసరం. వీటితో పాటు మాడిఫైడ్ బేరియమ్ స్వాలో టెస్ట్; వీడియో ఫ్లోరోస్కోపీ, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ (ఫీస్) / ట్యూబ్ ఇవాల్యుయేషన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించాల్సి రావచ్చు. చికిత్స.. సమస్య ఏ కారణంతో వచ్చిందనే అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా యాక్సిడెంట్ వంటి కేసుల్లో సర్జరీతో పరిస్థితిని చక్కదిద్దాల్సి రావచ్చు. (ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఆహారం గుటకవేయలేని పరిస్థితి ఉంటే రైల్స్ ట్యూబ్ ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తారు). ఈసోఫేజియల్ దశలో వచ్చే సమస్యలకు ఈసోఫేజియల్ డయలేషన్, స్టెంట్ ప్లేస్మెంట్ చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఓరల్, ఫ్యారింజియల్ దశల్లో వచ్చే సమస్యలను స్వాలోయింగ్ థెరపీ వంటి చికిత్స అవసరం పడవచ్చు. క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, మందులతో చికిత్స వంటి రకరకాల చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. — డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్. -
'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!?
'దేహ నిర్మాణంలోనూ, దారుఢ్యంలోనూ ఎముకలది కీలక పాత్ర. ఎముకలు బలంగా ఉంటేనే మనిషి బలంగా ఉంటాడు. ఆరోగ్యంగానూ ఉంటాడు. చిన్న వయసులో ఎముకలు చాలా ఫ్లక్సిబుల్గా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకల్లోకి క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు నిండుతూ పోతుంటాయి. ఫలితంగా ముప్ఫయిల వయసు నాటికి ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆ గరిష్ఠ స్థాయికి చేరాక మళ్లీ ఎముక సాంద్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా తగ్గడాన్ని ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అంటారు. మెల్లగా తగ్గుతూపోతుంటే చాలాకాలం బలంగా ఉంటుంది. లేదంటే బలహీనపడుతుంది. ఈ 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ కథా కమామిషు చూద్దాం.' 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలంటే...? మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సిమెంటు అనుకుంటే... సూర్యరశ్మి నుంచి దొరికే విటమిన్ ‘డి’ ఈ కాంక్రీటును కలిపే నీరుగా భావిస్తే.. ఇదంతా ఎముకలో బలంగా కూరేలా చేసేది మనం చేసే వ్యాయామం. ఈ మూడు గరిష్ఠంగా కలగలిసి ఎంత బలంగా కూరినట్లు అయితే ఎముక అంత బలంగా మారుతుంది. అలా రూపొందే ఎముక సాంద్రత మీద ఎముక బలం ఆధారపడి ఉండటంతో.. ఎముక ఆరోగ్యానికి ‘బోన్ మినరల్ డెన్సిటీ’ అన్నది ఓ సూచికగా ఉంటుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఈ బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతూ పెరుగుతూ 30వ ఏటికి వచ్చేసరికి దాదాపుగా గరిష్టంగా కొంతకాలం పాటు ఉండి, మళ్లీ అప్పటి నుంచి క్రమంగా తగ్గుతుంటుంది. ప్రోగ్రెసివ్ బోన్ లాస్ మహిళల్లో మరింత ఎక్కువ. ఎముకలు తమ సాంద్రత కోల్పోయే కండిషన్ పురుషుల కంటే మహిళల్లో చాలా వేగంగా జరుగుతుంది. సాధారణంగా వాళ్లలో వ్యాయామం చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉండటం, అదీగాక 45 ఏళ్లు దాటాక రుతుస్రావం ఆగిపోవడం, దాంతో మెనోపాజ్ తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. ఈ కారణంగానే మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ. ఎముక సాంద్రత తగ్గడానికి కారణాలు.. మన ప్రమేయం లేనివి.. కొందరికి జన్యుపరంగానే ఎముక సాంద్రత ఎక్కువగా ఉంటుంది. వారిలో వంశపారం పర్యంగానే చాలా పెద్దవయసు వచ్చేవరకు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చే మార్చలేని అంశం. ∙కొందరిలో కుషింగ్ సిండ్రోమ్, హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తిలేకపోవడంతో ఆహారానికి దూరంగా ఉండటం), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గి, ఆ తర్వాత ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. కొందరు తరచూ కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడుతుండటం, అవి తగ్గడం కోసం గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ వంటి మందులు వాడుతుండటం... ఎముక సాంద్రతను తగ్గిస్తాయి. జెండర్ కారణాలు.. మహిళల విషయంలో.. అందునా వాళ్లలో మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ. ఎత్తు తక్కువగా ఉన్న మహిళల్లో రిస్క్ ్రపోగ్రెసివ్ బోన్లాస్ ముప్పు మరింత ఎక్కువ. (అంటే.. బరువు అరవై కిలోల లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). మన చేతుల్లో/ నియంత్రణలో ఉండే అంశాల విషయానికి వస్తే.. మన నియంత్రణలో ఉండే కొన్ని అంశాలు పాటించడం ద్వారా ప్రోగ్రెసివ్ బోన్ లాస్‌ను నివారించవచ్చు. అదెలాగంటే.. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పాలు, నట్స్ వంటి ఆహారాలు తీసుకుంటూ ఉండటం. దేహానికి విటమిన్–డి సమకూరేలా లేత ఎండలో వ్యాహ్యాళిగా తగినంత వ్యవధి పాటు తిరగడం. (నేరుగా పడే, తీవ్రమైన ఎండలో తిరగకూడదు). రోజుకు 30 – 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం. మన జీవనశైలి మార్చుకోవడం అంటే కాఫీ వంటివి పరిమితంగా తీసుకోవడం. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం. కంటినిండా తగినంతగా నిద్రపోవడం. ఒకవేళ కౌమార, యౌవన దశల్లో వ్యాయామానికి దూరంగా ఉండటం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు లోనైతే ఎముక సాంద్రత తగ్గిపోవడంలో వేగం పెరుగుతుంది. ఎముకలు త్వరగా గుల్లబారిపోయి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు త్వరగా వచ్చేందుకు అవకాశం పెరుగుతుంది. ఎముక సాంద్రత తెలిసేదెలా..? ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అనే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ పరీక్షే ఎముక సాంద్రత తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. బాధితుల వయసు ఆధారంగా ఎముక సాంద్రతను లెక్కగడతారు. దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దాంతో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలూ అవసరం పడవచ్చు. ఎముక సాంద్రత పెంచుకోవడం కోసం.. ప్రోగ్రెసివ్ బోన్లాస్ నివారణకు మన చేతిలో ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తే... ఎముక సాంద్రత పెంచుకోడానికి దోహదపడుతుంది. యుక్తవయసు పిల్లల్ని ఆరుబయట ఎండలో ఆడేలా ్రపోత్సహించడం. పెరిగే వయసు నుంచే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతోపాటు బ్రాకలీ వంటివి ఎక్కువగా తీసుకునేలా చూడటం. చిన్న వయసు నుంచి లేత ఎండలో ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల దేహంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. అది ఆహారాన్ని ఎముకల్లోకి ఇంకిపోయేలా చేయడంతో సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా ఎంత చిన్న వయసు నుంచి ఈ అలవాట్లు నేర్పితే.. అంత సుదీర్ఘకాలం సాంద్రత నిలిచి ఉండి, ప్రోగ్రెసివ్ బోన్ లాస్ తగ్గుతుంది. దాంతో వృద్ధాప్యంలో పడిపోవడం (ఫాల్), ఇతర ఎముకలతో పాటు ప్రధానంగా తుంటి ఎముకల వంటివి విరగడాన్ని నివారించవచ్చు. — డాక్టర్ సుధీర్‌రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. -
మన దేశంలోనే ఆ కంపెనీలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాను: దియా మీర్జా
లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది... నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది. ‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్‌లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది. అవును...ఈరోజే మంచిరోజు అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్‌లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది! – దియా మీర్జా, నటి, క్లైమేట్ యాక్టివిస్ట్ -
కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే ఇది చదవండి
ఎండవేడి ఇంకా తగ్గడం లేదు. వర్షాకాలం మొదలైనా ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో వేడి తట్టుకోలేక చాలామంది శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ కూల్‌డ్రింక్స్‌ను ఇష్టపడుతుంటారు. ఇంటికి అతిథులు వచ్చినా, ఏదైనా నాన్‌వెజ్ వంటలు తిన్నా పక్కన కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే అనేంతలా లాగిస్తుంటారు. అయితే ఇలా కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ► కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు గుర్తించాక నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ► కూల్‌డ్రింక్స్‌లో ఎక్కవ మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దీనిల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తాగితే ఊబకాయం సమస్య తలెత్తుతుంది. ► శీతల పానీయాల్లో ఉండే కృత్రిమ చక్కెర, సోడా వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పటికే గుండె, డయాబెటీస్‌తో బాధపడుతున్నట్లయితే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ► మధుమేహం, గుండె జబ్బులకు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణం. ► కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్పోరిక్ యాసిడ్ వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడతాయి. అలాగే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ► కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది. మొత్తానికి కూల్‌డ్రింక్స్ వల్ల శరీరానికి మంచి కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. -
దీర్ఘకాలిక నొప్పి నుంచి బాధపడుతున్నారా? ఫిజియోథెరపీతో మీ సమస్యకు చెక్
శరీర పనితీరును మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కంకషన్ నుంచి కోలుకోవడానికి చేయాల్సిన వ్యాయామాలు ఏంటి? అన్నది ఇప్పుడ చూద్దాం. మెదడుకు గాయం తగిలిన తర్వాత తక్షణ వైద్య సహాయం తప్పనిసరి. సరైన చికిత్స,త్వరగా కోలుకోవడానికి, కంకషన్ల కోసం ఫిజియోథెరపీ వ్యాయామాల కోసం నిపుణుడిని సంప్రదించాలి. 1.కంకషన్ అంటే ఏమిటి? తలకు నేరుగా గాయం తగిలినప్పుడు లేదా మెదడు వేగంగా కదిలినప్పుడు కంకషన్ సంభవిస్తుంది. కంకషన్ అంటే మెదడు వాస్తవానికి "చెడిపోలేదు", కానీ మెదడులోని రక్త ప్రవాహం మరియు సెల్యులార్ పనితీరు మార్చబడతాయి. గాయపడిన ప్రాంతంపై ఆధారపడి, ఇది తాత్కాలిక లేదా శాశ్వత మెదడు పనితీరు సమస్యలకు దారితీయవచ్చు.వికారం, తలనొప్పి, మైకము, అస్పష్టమైన దృష్టి కంకషన్ యొక్క శారీరక లక్షణాలు. 2.కంకషన్ కోసం ఫిజియోథెరపీ వ్యాయామాలు ఫిజియోథెరపిస్ట్ కార్డియోవాస్కులర్, న్యూరోలాజికల్,ఆర్థోపెడిక్ వ్యవస్థలను పరిశీలిస్తాడు. ఒక ఫిజియోథెరపిస్ట్ రోగి కంకషన్ నుంచి కోలుకోవడానికి సహాయం చేస్తాడు. 3.విశ్రాంతి విశ్రాంతిని నిర్ధారించడానికి కంకషన్ తర్వాత శారీరక శ్రమను పరిమితం చేయడం ముఖ్యం. విశ్రాంతి మెదడును రికవరీ మోడ్‌లోకి పంపుతుంది. 4.మెడ పునరావాసం చాలా తరచుగా.. కంకషన్‌కు ముందు, ఆ తర్వాత మెడ గట్టిగా లేదా ఉద్రిక్తంగా ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలిక నొప్పి భుజాలకు చేరుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ వ్యాయామాలు నొప్పి,అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గర్భాశయ థొరాసిక్ వెన్నెముక కదలికను ప్రోత్సహిస్తాయి. 5. శక్తి పునరుద్ధరణ ఒక కంకషన్ తర్వాత కండరాల బలహీనత,శారీరక ఓర్పును తగ్గిస్తుంది. అందువల్ల, ఫిజియోథెరపిస్ట్ లక్షణాలను మరింత దిగజార్చకుండా బలాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెడతారు. 6.తలనొప్పి చికిత్స కంకషన్ల యొక్క చెత్త లక్షణాలలో తలనొప్పి ఒకటి. తలనొప్పి చికిత్స కోసం ఫిజియోథెరపీలో ప్రత్యేకమైన మసాజ్, స్ట్రెచ్‌లు, కంటి వ్యాయామాలు,విద్యుత్ ప్రేరణ వంటివి ఉంటాయి. 7.ఏరోబిక్ వ్యాయామ కార్యక్రమం ఫిజియోథెరపిస్టులు బఫెలో కంకషన్ ట్రెడ్మిల్ పరీక్ష వంటి గ్రేడెడ్ వ్యాయామ పరీక్షలను ఉపయోగిస్తారు. తేలికపాటి కంకషన్ ఉన్న రోగులలో రికవరీ ప్రక్రియలో ఈ పరీక్షను ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యంగా నిరంతర లక్షణాలు ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. 8.అటానమిక్ నాడీవ్యవస్థ పునరావాసం తలను పైకి లేపడం.కంప్రెషన్ మేజోళ్ళు ధరించడం.ఆహారంలో ఉప్పు కలపడం. ఒక రోగి నిరంతర అటానమిక్ డిస్ఫంక్షన్ లక్షణాలను అనుభవిస్తే, కింది వ్యాయామాలతో కూడిన ఫిజియోథెరపిస్ట్ ఏరోబిక్ వ్యాయామ కార్యక్రమం సిఫార్సు చేస్తారు.ట్రెడ్మిల్ వ్యాయామం,నడక / జాగింగ్,మెట్లు ఎక్కడం.. ఈ వ్యాయామాలు వారానికి మూడుసార్లు 30 నుంచి 60 నిమిషాలు చేయాలి.ఇవి మెదడు,నాడీ వ్యవస్థను ఓవర్‌లోడ్ చేయని విధంగా చేయాలి.ఇది మెదడు కణజాలం యొక్క సరైన వైద్యంలో సహాయపడుతుంది. -
మన కితకితలు మనకు ఎందుకు నవ్వు తెప్పించవంటే..
కితకితలు.. ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎవరైనా కితకితలు పెడుతున్నప్పుడు మనకు విచిత్ర అనుభూతి కలిగి, నవ్వు వస్తుంటుంది. ఇటువంటి సందర్భంలో పగలబడి నవ్విన ఉదంతాలు కూడా ఉంటాయి. సాధారణంగా చిన్నపిల్లలకు పెద్దవాళ్లు కితకితలు పెట్టడం చూస్తుంటాం. అటువంటప్పుడు పిల్లలు ఆనందంతో మెలికలు తిరిగిపోతూ నవ్వుతుంటారు. అయితే ఇక్కడున్న ఒక విచిత్ర విషయాన్ని చాలామంది గమనించివుండరు. ఎవరికి వారు కితకితలు పెట్టుకున్నప్పుడు నవ్వు రాదు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కితకితలు అనుభూతికి రావడంలో మన మెదడులోని రెండు భాగాలు బాధ్యత వహిస్తాయి. వాటిలో మొదటిది కార్టిక్స్.. ఇది శరీరపు స్పర్శను అనుభూతి చెందుతుంది. ఇక రెండవది ఎంటీరియా సింగులెట్ కార్టిక్స్. ఇది ఆనందాన్ని, సెన్సేషన్‌ను అనుభూతి చెందుతుంది. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడులోని సెరిబెల్మ్ భాగానికి ముందుగానే ఈ విషయం తెలిసిపోతుంది. దీంతో అది కార్టిక్స్‌కు ఆ సమాచారాన్ని అందిస్తుంది. దీంతో కితకితలకు సిద్ధమైన కార్టిక్స్ అంతకుముందే విషయాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా మనకు మనం కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. ఎటువంటి అనుభూతి కూడా కలుగదు. కితకితలను అనుభూతి చెందేందుకు సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది తప్పనిసరి. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడు ముందుగానే శరీరానికి సిగ్నల్ పంపుతుంది. అందుకే మన కితకితలు మన అనుభూతికి అందవు. అయితే మనకు ఎవరైనా కితకితలు పెట్టినప్పుడు మన మెదడు ఆ సిగ్నల్‌ను కార్టిక్స్‌కు పంపలేదు. దీంతో మెదడు కితకితల అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండదు. ఫలితంగా ఎవరైనా కితకితలు పెడితే వెంటనే ఎడతెగకుండా నవ్వువస్తుంది. అయితే ఇతరులు కితకితలు పెడుతుంటే మనం నవ్వడం కొంతవరకూ మంచిదేనని నిరూపితమయ్యింది. అప్పుడప్పుడు మన శరీరంపై ఏదైనా పురుగు లేదా కీటకం పాకినప్పుడు మనకు శరీరం జలదరిస్తుంది. వెంటనే ఆ పురుగును లేదా కీటకాన్ని తీసి బయట పారేస్తాం. మెదడు ఈ విధంగా కూడా మనకు రక్షణ కల్పిస్తుంది. -
మిక్స్డ్ వెదర్‌తో మహా డేంజర్! డాక్టర్ల కీలక సూచనలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వేసవి కాలం చివరి రోజుల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రమంతా ఉదయం నుంచే 40 నుంచి 45 డిగ్రీల ఎండలు హీటెక్కిస్తున్నాయి. వడగాడ్పులతోపాటు అప్పుడప్పుడు సాయంత్రం అకస్మాత్తుగా గాలివాన కురియడంతో వాతావరణం చల్లబడుతోంది. అదీగాక వేసవి సీజన్ ముగిసిపోతుండటంతో ఎండలు చండప్రచండంగా మారుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ నివేదికలున్నా.. ప్రతీ ఏడాది ఇవి ఆలస్యంగానే వస్తున్నాయి. అందువల్ల మరికొన్ని రోజులపాటు ఇలాంటి ‘మిక్స్డ్ వెదర్’తోనే ప్రజలు నెట్టుకురాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాతావరణంలో బ్యాక్టీరియాలు, వైరస్లు చురుగ్గా ఉండి దాడి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా మసలుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలి అటు వేడి, ఇటు చల్లదనం వంటి మధ్యస్థ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు యాక్టివ్‌గా ఉంటాయి. మన శరీరాలు కూడా అటు వేడికి, ఇటు చల్లటి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అలాంటి సమయం కోసం వైరస్లు, బ్యాక్టీరియాలు వేచిచూసి దాడిచేస్తాయి. టైఫాయిడ్, సీజనల్ జ్వరాలు, గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లుయెంజా వైరస్ల వంటివి వచ్చే అవకాశాలు అధికమవుతాయి. ఇలాంటి వాటికి ఆహారాన్నే ఔషధంగా మార్చుకుని తిప్పికొట్టాలి. ఫ్రైడ్ పదార్ధాలు, జంక్‌ఫుడ్ వంటివి మానేయాలి. అప్పటికప్పుడు వేడిగా తయారుచేసిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీరు లేదా పరిశుభ్రమైన నీటిని తాగాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే వ్యాధినిరోధక« శక్తిని పెంచుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి తీవ్ర ఎండ వేడిమి నుంచి చల్లటి వాతావరణానికి మారినపుడు అనేక జబ్బులు వ్యాపిస్తాయి. ఇంకా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నందున వడదెబ్బ తగులకుండా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగడంతోపాటు సహజమైన పళ్లరసాలు వంటివి తీసుకోవాలి. దోమలు, ఎలుకలు వంటి వాటి ద్వారా నీరు.. గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతాయి. డెంగీ, మలేరియా వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం నీటిలో తడిచిన ప్రతీసారి ఫ్రెష్‌గా స్నానం చేయాలి. ఏడాదికోసారి ఫ్లూవ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి.