చార్మినార్ (హైదరాబాద్) : మీటర్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న ఆటో డ్రైవర్లను కట్టడి చేసేందుకు అధికారులు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ పాతబస్తీలో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు ఆటో మీటర్ల తనిఖీ చేపట్టారు. ఆటోల్లో వేసిన మీటర్ సీళ్లు తొలగించి ఇష్టానుసారంగా ప్రయాణీకుల వద్ద నుంచి అధికంగా చార్జీలను వసూలు చేయడంతోపాటు చలాన్లను కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న ఆటో డ్రైవర్లను గుర్తించారు. ఏకకాలంలో నిర్వహించిన ఈ దాడుల్లో 22మంది ఆటోడ్రైవర్లు మీటర్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలింది. వీరిపై రూ.2 వేల జరిమానా విధించటంతోపాటు ఆటో మీటర్లను సీజ్ చేశారు. చార్మినార్ వద్ద చేపట్టిన సోదాల్లో చార్మినార్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నల్లపు లింగయ్యతో పాటు జిల్లా తూనికలు, కొలతల శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఎ.కె. ఖాన్, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.