జగిత్యాల జోన్, న్యూస్‌లైన్: వ్యవసాయ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం మండలంలోని పొలాస వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్న అజ్మీరా మంజుల(20) ఉరి వేసుకొని బలవన్మరణం చెందింది. అనారోగ్యంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తుండగా, ఆమె తల్లిదండ్రులు మాత్రం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం రావోజిపేటకు చెందిన మంజులకు పొలాస వ్యవసాయ కళాశాలలో సీటు రావడంతో మూడేళ్లుగా కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. కొంత కాలంగా ఆమె మానసిక వేదనతో ఉంటోంది. దగ్గు దమ్ముతో బాధ పడుతోంది. తనను ఎవరో రమ్మంటున్నారని, చనిపోవాలని ఉందని తోటి స్నేహితులతో చెబుతుండేది.
ఆమె స్నేహితులు శ్రావణి, పవిత్ర, ప్రతిభ ఆమెకు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ఉండేవారు. అయినా మంజుల అలాగే ప్రవర్తిస్తోంది. దీంతో ఆమెను పదిహేను రోజుల క్రితం ఆమె సోదరుడికి అప్పగించి వచ్చారు. మంజులను ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం నయం కావడంతో నాలుగు రోజుల క్రితం ఇంటర్నల్ పరీక్షలు రాసేందుకు తిరిగి హాస్టల్‌కు వచ్చింది. అయినా ఆమెలో మార్పు రాలేదు. స్నేహితులు మాట్లాడిస్తేనే మాట్లాడేది. ఎప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తుండేది. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి రూంలో నిద్రించిన మంజుల ఆదివారం ఉదయం కనిపించలేదు. స్నేహితులు అన్ని గదులు వెతికారు. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించిన ఆమె ఖాళీ గదిలో ఉందేమోనని వెళ్లి చూడగా మంజుల ఫ్యాన్‌కు చున్నీ, నైలాన్ తాడుతో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే వారు విషయాన్ని ప్రొఫెసర్లకు తెలిపారు. వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
మంజుల తల్లితండ్రులను రప్పించారు. రూరల్ ఎస్సై సరిలాల్ వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మంజుల స్నేహితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంజుల మృతదేహాన్ని చూసిన ఆమె తల్లితండ్రులు లక్ష్మిబాయి, పంతులునాయక్, సోదరుడు సాగర్ గుండెలు బాదుకుంటూ రోదించారు. తమ కూతురు చనిపోయేంత పిరికిది కాదని, అనారోగ్యంతో ఉంటే బాగు చేయించామని, మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు తెలిపారు. మంజుల కాళ్లు బెడ్‌పై ఆనుతున్నాయని, నైలాన్ తాడు ఎక్కడిదని ప్రశ్నించారు. ఎప్పుడో చనిపోతే ఆలస్యంగా సమాచారమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బంధువులు వచ్చేదాకా హాస్టల్ నుంచి మృతదేహాన్ని తరలించవద్దని కోరారు. మధ్యాహ్నం 2 గంటలదాకా మృతదేహాన్ని కదలనీయలేదు. ఓ దశలో ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారు. సీఐ గౌస్‌బాబా వచ్చి ఎలాంటి అనుమానాలున్నా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. చదువులో ముందుండే మంజుల చనిపోవడంతో ఆమె స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు. ప్రొఫెసర్లు దిగ్భ్రాంతి చెందుతున్నారు.
‘వ్యవసాయ’ విద్యార్థిని ఆత్మహత్య
Published Mon, Sep 23 2013 3:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement