అంగన్‌వాడీ.. ఫేస్‌బుక్‌ జోడీ..! | Anganwadi activists Open facebook accounts | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ.. ఫేస్‌బుక్‌ జోడీ..!

Published Sun, Sep 9 2018 9:03 AM | Last Updated on Sun, Sep 9 2018 12:43 PM

Anganwadi activists Open facebook accounts  - Sakshi

ఒంగోలు టౌన్‌: నాలుగు గోడలకే పరిమితమైన అంగన్‌వాడీ సేవలు ఇక నుంచి బహిర్గతం కానున్నాయి. ఇప్పటివరకు శాఖాపరమైన అధికారులు మాత్రమే వారి పనితీరు తెలుసుకుంటూ వచ్చారు. ఇక నుంచి ఆ సేవలను ఫేస్‌బుక్‌ ఖాతాలున్నవారంతా తెలుసుకునేలా చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీలు ఫేస్‌ బుక్‌ ఖాతాలు తెరవాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో 4,244 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకుగానూ దాదాపు 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మిగిలిన 3,900 మంది అంగన్‌వాడీలకుగానూ ఇప్పటివరకు 900 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఫేస్‌ బుక్‌ ఖాతాలు తెరిచారు. అంగన్‌వాడీలతో పాటు సంబంధిత ప్రాజెక్టు డైరెక్టర్లు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు కూడా పేస్‌ బుక్‌ ఖాతాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సూపర్‌వైజర్‌ నుంచి ఆపైస్థాయి అధికారి వరకు ఎక్కువ మందికి ఫేస్‌ బుక్‌ ఖాతాలు ఉన్నాయి. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఫేస్‌ బుక్‌ ఖాతాలను చూసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంగన్‌వాడీలంతా ఫేస్‌ బుక్‌ ఖాతాలు తెరవాలంటూ ఆదేశాలు రావడంతో మెజార్టీ అంగన్‌వాడీలు ఆందోళన చెందుతున్నారు. 

పారదర్శకత కోసమే...
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు పారదర్శకంగా ఉండాలంటూ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఆదేశిస్తూ వస్తోంది. అంగన్‌వాడీలకు సంబంధించి గతంలో అనేక రికార్డులు నిర్వహిస్తూ వచ్చారు. మాన్యువల్‌గా వాటిని నిర్వహించడం కష్టతరమైంది. ఇదే విషయాన్ని ఆ శాఖ అధికారుల ద్వారా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం దానిని అంగన్‌వాడీ కేంద్రాలకు క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ (కాస్‌) పేరుతో పైలెట్‌ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాజెక్టులను ఎంపికచేసి ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా అమలు చేస్తోంది. 

జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 4,244 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 16,201 మంది గర్భిణులు, 20,370 మంది బాలింతలు, ఒకటి నుంచి మూడేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులు లక్షా 3 వేల 852 మంది, మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు లక్షా 9 వేల 371 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యతోపాటు అన్న అమృతహస్తం, బాలామృతం, కొన్ని ప్రాజెక్టుల్లో బాలసంజీవని కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను పెంచిన ప్రభుత్వాలు అదే సమయంలో పారదర్శకంగా వాటిని అందించాలన్న ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మరింత మందికి తెలిసేవిధంగా ఫేస్‌ బుక్‌ వంటివాటికి శ్రీకారం చుట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement