అన్నవరం దేవస్థానం మాస్టర్ ప్లాన్ రెడీ
అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణ పథకాలు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాల్లో చేయాల్సిన మార్పులు తదితర విషయాలపై మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. రాష్ట్రప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఈఈ రాఘవప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ తాము రూపొం దించిన మాస్టర్ ప్లాన్‌ను గురువారం ఉదయం 11-30 గంటలకు దేవస్థానంలోని నిత్యకల్యాణ మండపంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు, సిబ్బందికి వివరించనుంది. ఈ విషయాన్ని దేవస్థానం ఈఓ పి.వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
ఇదీ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం
అన్నవరం దేవస్థానానికి గతంలోనే మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. అయితే ఆగమశాస్త్రాలను, నియమనిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండానే, కేవలం చేపట్టాల్సిన నిర్మాణాల కోసమే దానిని రూపొందించారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటూనే, ఆగమశాస్త్ర ప్రకారం మరో మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు దేవాదాయశాఖ విశ్రాంత కమిషనర్ ముక్తేశ్వరరావు హైదరాబాద్‌కు చెందిన రాఘవ డిజైన్ వర్క్స్ ఇంజినీర్లను నియమించారు. సుమారు ఆరునెలల క్రితం నుంచి పని ప్రారంభించిన ఇంజినీర్ల బృందం రత్నగిరి, సత్యగిరిపై చేయాల్సిన నిర్మాణాలు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాల్లోని ఆగమశాస్త్ర విరుద్ధ లోపాలు, వాటి పరిష్కారాలు, కొండదిగువన చేపట్టాల్సిన అభివృద్ధి పథకాలు, వాటర్ మేనేజ్‌మెంట్, తదితర విషయాలతో ఈ మాస్టర్‌ప్లాన్ రూపొందించింది.
మాస్టర్‌ప్లాన్‌లోని ముఖ్యాంశాలివీ..
సత్యదేవుని ఆలయం కన్నా దేవస్థానంలోని ఇతర భవనాలు ఎత్తులో ఉండరాదు. అయితే సత్యగిరిపై నిర్మించిన హరిహరసదన్ సత్రం ఆలయం కన్నా ఎత్తులో ఉంది. దీనికి కారణం రత్నగిరి కన్నా, సత్యగిరి ఎత్తు 40 మీటర్లు ఎక్కువ ఉండడమే. దానిపై ఐదంతుస్తుల సత్రం నిర్మించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలి.
సత్యదేవుని ఆలయానికి భవిష్యత్తులో నిత్యం సరాసరిన 15వేలమంది భక్తులు వచ్చే వీలుంది. దీనికి తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టాలి. దీనికోసం సాధ్యమైనంతగా కొండదిగువన దేవస్థానం విద్యాసంస్థలున్నచోట మౌలికవసతులు కల్పిం చాలి. విద్యాసంస్థలను మరో చోటకు తరలిం చాలి. దీంతో కొండపై భక్తుల తాకిడి తగ్గుతుంది. సత్యదేవుని ఆలయం వెలుపల ప్రస్తుతం అన్నదానం, ప్రసాదాల తయారీ విభాగాలు ఉన్నాయి. వీటిని ఆలయ ప్రాకారం లోపలే ఉండేలా చూడాలి. దీనికోసం ప్రస్తుతం ఉన్న షాపింగ్‌కాంప్లెక్స్‌ను పార్కింగ్‌ప్లేస్‌లోకి మార్చా లి. ప్రాకారం నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాలను వాటి జీవితకాలం తర్వాత కూల్చివేయాలి.
దేవస్థానంలోని ప్రతీభవనాన్ని ఆలయ సంస్కృతిని ప్రతిబింబించేలా మార్పు చేయాలి. ఆలయం వెనుక లిఫ్ట్ డిజైన్‌ను కూడా మార్చాలి. నీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా పొదుపు చేయవచ్చు. బాత్‌రూమ్‌లలో వాడుతున్న నీటిని నిల్వచేసి దానిని మొక్కల పెంపకానికి వాడవచ్చు. నీటి వినియోగం పెరగనున్నందున ఇప్పటి నుంచే నీటి పొదుపు చర్యలు చేపట్టాలి. రత్నగిరి చుట్టూ ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో టూరిజం హబ్‌గా రూపొందే అవకాశం ఉంది. అందుకనుగుణంగా ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలి.
మార్పులు, చేర్పులపై నేడు చర్చ
మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు, చేర్పులపై గురువారం చర్చిస్తారు. అనంతరం దీనిని దేవస్థానం కమిటీ ఆమోదించి దేవాదాయశాఖ కమిషనర్‌కు, అక్కడి నుంచి ఐదుగురు ఐఏఎస్ అధికార్ల కమిటీ ముందుకు పంపుతారు. వారూ ఆమోదించాక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది.