ఉభయగోదావరి జిల్లాల్లో ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో వాటర్‌గ్రిడ్ పథకానికి 4,145 కోట్ల రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఉభయ జిల్లాల అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా ఈ పథకం కార్యరూపం దాల్చేందుకు కృషి చేశారు.
సాక్షి, ఆకివీడు(తూర్పుగోదావరి): ఉభయ గోదావరి జిల్లాల్లో ఏళ్ల తరబడి ప్రజలు కలుషిత తాగునీటితో అవస్థలు పడుతున్నారు. రొయ్యలు, చేపల చెరువులతో రక్షిత నీటి పథకాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల చెరుకు రసం రంగులో నీరు సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు పడరాని కష్టాలు పడుతున్నారు. గత ప్రభుత్వం ఇక్కడి ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోలేదు.
పాదయాత్రలో జననేత జగన్ దృష్టికి సమస్య
ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి పలు ప్రాంతాల్లోని మహిళలు తాగునీటి సమస్యను తీసుకెళ్లారు. ప్రజల కష్టాలకు చలించిన ఆయన బహిరంగ సభల్లో అప్పటి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికారంలోకి వస్తే ప్రజల తాగునీటి సమస్యలు తీరుస్తామని హమీ ఇచ్చారు. శుద్ధ గోదావరి జలాలను ఇళ్ల ముంగిటకు తీసుకొస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
వాటర్ గ్రిడ్ పథకం స్వరూపం ఇదీ..
గ్రామీణ నీటిపారుదల శాఖ వాటర్ గ్రిడ్‌కు ప్రతిపాదనలు రూపొందించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా వరకూ రూ. 4,145 కోట్ల వ్యయంతో 560 కిలో మీటర్ల మేర ప్రధాన పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి, జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని 909 గ్రామాలు, 8 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలోని సుమారు 42 లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందజేయాలని ప్రణాళిక రూపొందించారు. జిల్లాను ఐదు విభాగాలు (ట్రంక్)గా విభజించారు. విజ్జేశ్వరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పోలవరం జలధారలుగా విభజించారు. ప్రధాన పైప్‌లైన్, ఓవర్‌హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు(ఓహెచ్‌బీఆర్), ఓవర్ హెడ్ ట్యాంక్ (ఓహెచ్‌ఎస్‌ఆర్)లు, సంప్‌లు, పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో పైప్‌లైన్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు తదితర వాటి నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందించారు.
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు
ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్ స్వయంగా ప్రజల కష్టాలు చూశారు జిల్లా ప్రజల ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధికి తీసుకునే చర్యలపై ఆలోచించారు. ఆ ఆలోచనల్లో నుంచే వాటర్‌గ్రిడ్ పథకం పుట్టింది. ఈ పథకానికి కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకువచ్చేందుకు యత్నిస్తాను. మూడేళ్లలో పథకం పూర్తి చేయాలన్న యోచనతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు.
– కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఎంపీ, నరసాపురం
డెల్టాకు అత్యవసరం
డెల్టా ప్రాంతానికి స్వచ్ఛ గోదావరి జిల్లాలు అత్యవసరం. డెల్టాలోని కాలువలన్నీ కలుషితమైపోయాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆయన దృష్టికి తీసుకువెళ్లాను. ఆయన అకాల మరణం తర్వాత ఈ విషయాన్ని ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పాదయాత్రలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కాలుష్య నీటి సమస్యను వివరించాను. ఆయన కూడా ప్రజల నీటి కష్టాలకు కళ్లారా చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే వాటర్‌గ్రిడ్‌కు రూపమిచ్చారు. ఇది సంతోషకరమైన విషయం.
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment