అడుగడుగునా నిఘా
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ ఆకె రవికృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా గ్రామ గ్రామానా సోదాలు చేపట్టారు. ఎన్నికల ముందే మద్యం భారీగా డంప్ చేశారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపులు, సారా బట్టిలపై కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి
ఆదేశాలిచ్చారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే ఆళ్లగడ్డలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మొబైల్ టీంలతో ఆకస్మిక తనిఖీలూ చేపడుతున్నారు. వీటితోపాటు కొన్ని ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టారు. పల్లె నిద్రలో భాగంగా ఆయా స్టేషన్ల పరిధిలోని అధికారులందరూ గ్రామాల్లో పర్యటించి.. గ్రామ సభలు ఏర్పాటు చేసి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా గ్రామస్తుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ ఎన్నికల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలని, బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని వారికి సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారు, సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి బైండోవర్ చేస్తున్నారు.
ఆయుధాలు సీజ్..
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామాల్లో మారణాయుధాలు, తుపాకుల ఏరివేతపై పోలీసులు దృష్టి సారించారు. అహోబిలం ప్రాంతాల్లో చెంచులు అడవుల్లోకి వెళ్లేటప్పుడు నాటు తుపాకులు ఉపయోగిస్తున్నందున ఉప ఎన్నికల్లో భాగంగా వాటిని కూడా స్వాధీనం చేసుకునేటట్లు ప్రత్యేక బృందాలను నియమించారు. అలాగే లెసైన్స్ తుపాకులను కూడా పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేసే విధంగా ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు.
ఇప్పటి వరకు 132 ఆయుధాలను పోలీసులు డిపాజిట్ చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండి ఎన్నికల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠినంగా చర్యలుంటాయని అన్ని రాజకీయ పక్షాల నాయకులకు ఎస్పీ హెచ్చరించారు. స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు ఎవరైనా ఆళ్లగడ్డలో సంచరిస్తే డయల్ 100కు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.