బధిరుడి హత్య.. అవయవాలు మాయం!
చెత్తతో మృతదేహం దహనానికి యత్నం
వింజమూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూ రు జిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట దళితవాడకు చెందిన బధిరుడు(మూగ, చెవుడు) దమ్ము తిరుపాలు(35) దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. అయితే మృతుడి అవయవాలు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం కూలి పనికి వెళ్లి వచ్చిన తిరుపాలు ఆ తర్వాత కనిపించలేదు. అతడి కోసం రాత్రి వరకు కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. అయితే సోమవారం ఉదయం స్థానిక లోతువాగు సప్లయి చానల్లో తిరుపాలు మృతదేహాన్ని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు మృతదేహన్ని పరిశీలించగా కిడ్నీలు మాయమైనట్లు గుర్తిం చారు. సమీపంలోనే మరికొన్ని అంతర్గత భాగాలు కూడా పడి ఉన్నాయి. కాళ్లు, చేతులను మృతుడు ధరించిన దుస్తుల తోనే కట్టి వేసి, గొంతుకు కండువా గట్టిగా బిగించి లాగారు. ఆనవాలు గుర్తించకుండా ఉండేందుకు ముఖంపై చెత్త వేసి తగులబెట్టారు. అవయవాల సేకరణ ముఠా ఈ దురాగతానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. మృతుడికి తల్లి, తండ్రి, సోదరి ఉన్నారు.