అందుబాటులో డెంగీ జ్వర నిర్ధారణ కిట్లు | Available kits for the diagnosis of Dengue fever | Sakshi
Sakshi News home page

అందుబాటులో డెంగీ జ్వర నిర్ధారణ కిట్లు

Published Wed, Oct 22 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

Available kits for the diagnosis of Dengue fever

కడప అర్బన్ :
 జిల్లాలో డెంగీ జ్వర నిర్ధారణకు అవసరమయ్యే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆరోగ్య కేంద్రం, రిమ్స్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ‘జిల్లాలో డెంగీ జ్వరాలు-నియంత్రణ, దోమల నివారణ’పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు, వైద్య విధాన పరిషత్ , రిమ్స్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్వచ్చ భారత్ కార్యక్రమం ఇంటినుంచే ప్రారంభించాల్సి ఉందన్నారు. క్లస్టర్ల స్థాయిలో కన్వర్జెన్స్ కమిటీ సమావేశాలుఏర్పాటు చేసి డ్రైడే..ఫ్రైడే నినాదాన్ని ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ప్రభుదాస్ మాట్లాడుతూ టైగర్ దోమ వల్ల డెంగీ జ్వరం వస్తుందన్నారు. ఇది పగటిపూట సంచరిస్తూ ఉంటుందని తెలిపారు.

అరుుతే అంటువ్యాధి కాదన్నారు. డెంగీ రోగికి కుట్టిన దోమ మరో వ్యక్తికి కుట్టినపుడు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. మనిషి రక్తంలో రెండు లక్షలు ఉండాల్సిన ప్లేట్‌లెట్స్ 20 వేలకు తగ్గినపుడు మాత్రం అలాంటి రోగికి ప్లేట్‌లెట్స్ ఎక్కించడం జరుగుతుందన్నారు. రక్తం నుంచి ప్లేట్‌లెట్స్ సపరేట్ చేయడానికి అవసరమైన పరికరాలు రిమ్స్‌లో ఉన్నాయన్నారు.

డెంగీ జ్వరాన్ని తగ్గించడానికి ప్రత్యేకించి ఎలాంటి మందులు అవసరం లేదన్నారు.  జిల్లా అదనపు జేసీ సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం,ఐసీడీఎస్ పీడీ లీలావతి, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్, వైద్య విధాన పరిషత్ సమన్వయ అధికారి డాక్టర్ రామేశ్వరుడు, జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి పాల్గొన్నారు.

 రక్త కణాలు తగ్గిపోతున్న కేసులే ఎక్కువ
 ప్రొద్దుటూరు టౌన్:    మలేరియా జ్వరాలకంటే రక్త కణాలు తగ్గుతున్న కేసులు ఎక్కువగా వస్తున్నాయని ప్రైవేటు వైద్యులు ఆర్‌ఎంఓ బుసిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణలకు వివరించారు. మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని సూపర్‌బజార్ రోడ్డులో ఉన్న వైద్యులు రంగారెడ్డి ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి కేసులు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. క్రిటికల్ మలేరియా చాలా తక్కువగా ఉందన్నారు. వైరల్ జ్వరాలు వస్తున్నా ఆ శాతం కూడా చాలా తక్కువగానే ఉందన్నారు.  ప్లేట్‌లేట్స్ తగ్గినవన్నీ డెంగీ కేసులు కావని, మలేరియా, చికున్‌గున్యా, దగ్గుతో కూడిన జ్వరం వచ్చినా ప్లేట్‌లేట్స్ తగ్గిపోతాయని వైద్యులు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement