నరసరావుపేట ఈస్ట్
‘గుర్తింపులేని పాఠశాలలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం.. ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కేసులుపెడతాం.. జరిమానాలు విధిస్తా.. అవసరమైతే పాఠశాలలను సీజ్‌చేస్తాం..’ అంటూ విద్యాశాఖాధికారులు చేస్తున్న ప్రకటనలు ఆర్భాటంగానే కనిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా, అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
విద్యార్థులు నష్టపోయేదిలా..
ఓ విద్యార్థి ‘ఏ’ అనే ప్రైవేట్ పాఠశాలలో కొన్ని తరగతుల వరకు చదివాడు. తర్వాత ‘బి’ అనే స్కూల్‌లో చేరేందుకు ‘ఏ’ పాఠశాల ఇచ్చిన గుర్తింపు సర్టిఫికేట్‌ను తీసుకెళ్లాడు. అయితే ‘బి’ పాఠశాల యాజమాన్యం ‘ఏ’ పాఠశాలకు గుర్తింపులేదని, ఆ పాఠశాల ఇచ్చే సర్టిఫికెట్‌కు కూడా చెల్లదని తిప్పిపంపారు.
మరో విద్యార్థి ‘సి’ అనే ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివాడు. పదవ తరగతికోసం మరో గుర్తింపుపొందిన ‘డి’ అనే మరో పాఠశాలలో చేరేందుకు వచ్చాడు. అయితే ‘సి’ అనే పాఠశాలకు రెండేళ్ల క్రితమే గుర్తింపు గడువుతేదీ అయిపోయినా రెన్యూవల్ చేయించుకోకపోవడంతో ఆపాఠశాల గుర్తింపు రద్దు అయినట్లు చెప్పారు. దీంతో ఆ విద్యార్థులు, తల్లిదండ్రులు లబోదిబో అన్నా ఫలితం లేకపోయింది.
అధికారుల హడావుడి..
జిల్లావ్యాప్తంగా సుమారు 300కు పైగా గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నట్లు సమాచారం. నరసరావుపేట డివిజన్‌లో 67 గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఏళ్లకిందట స్థాపించిన పాఠశాలలు కొన్ని ఉండగా, మరికొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఉండటం గమనార్హం. ఏటా నూతన విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో విద్యాశాఖాధికారులు హడావుడి చేస్తున్నారు. గుర్తింపులేని పాఠశాలలను గుర్తించి ఆకస్మికదాడులు చేస్తారు. జరిమానాలు విధించడం.. అవసరమైతే పాఠశాలను సీజ్ చేస్తుంటారు.
అయినా కొన్నిరోజుల్లోనే మరలా ఆ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. గుర్తింపులేని పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖాధికారి కార్యాలయ ఆవరణలో, పత్రికల ద్వారా తెలియపరచాలని, అదేవిధంగా గుర్తింపులేని పాఠశాలల గోడలపై గుర్తింపులేని పాఠశాల అంటూ బోర్డును అతికించాలని, మైక్‌ద్వారా అనౌన్స్‌చేయించాలని తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాలు, ప్రజాసంఘాలవారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డిప్యూటీ డీఈవో ఎ.కిరణ్‌కుమార్, ఎంఈవో కేపీ బాబురెడ్డిని వివరణకోసం సాక్షి ఫోన్‌లో సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు.
మొక్కు‘బడి’గా దాడులు
Published Sun, Jun 15 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM
Advertisement