మాటల తూటాలు | Bezawada Council | Sakshi
Sakshi News home page

మాటల తూటాలు

Published Tue, Apr 5 2016 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

Bezawada Council

వాడీవేడిగా బెజవాడ కౌన్సిల్
టీడీఆర్ బాండ్లపై స్వపక్షంలోనే ఆగ్రహం
‘అమృత్’ను నిరసిస్తూ ప్రతిపక్షాల వాకౌట్
ముక్కలు కానున్న రాజీవ్‌గాంధీ పార్కు
కార్పొరేటర్లకు జీతాలు పెంచుతూ తీర్మానం

 

వాకౌట్‌లు, నిరసనల మధ్య నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. నువ్వు నాకు రూలింగ్ చెప్పక్కర్లేదంటూ మేయర్ కోనేరు శ్రీధర్ సెటైర్ వేయగా, మేం పేరంటానికి రాలేదు కూర్చోవడానికి.. సమస్యలు చెప్పనివ్వండి అంటూ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల కౌంటర్ ఇచ్చారు. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అమృత్ పథకాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ, సీపీఎం సభ్యులు వాకౌట్ చేశారు. ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల మంజూరు వ్యవహారం సభను కుదిపేసింది.

 


విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ రాత్రి 7.15 గంటల వరకు కొనసాగింది. అమృత్ పథకంపై పాలక, ప్రతిపక్షాల మధ్య రసవత్తర చర్చ నడిచింది.  ప్రతిపక్ష నేత బండి నాగేంద్ర పుణ్యశీల, సీపీఎం ఫ్లోర్‌లీడర్ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ జేఎన్‌ఎన్యూఆర్‌ఎం తరహాలోనే అమృత్ భారాలు ప్రజలపై పడే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన సంస్కరణల వల్ల ఎలాంటి భారాలూ పడవని మేయర్ స్పష్టం చేశారు. జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకాన్ని నగరంలో అమలు చేసి కొంపముంచింది సీపీఎం, సీపీఐలే అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అమృత్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సవరణ తీర్మానాలు ఇచ్చాయి. ఓటింగ్‌కు పుణ్యశీల పట్టుబట్టగా మేయర్ ససేమిరా అన్నారు. మేయర్ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ, సీపీఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

 
కుదిపేసిన బాండ్లు
ఫన్‌టైం క్లబ్ రోడ్డుకు సంబంధించి టీడీఆర్ బాండ్ల మంజూరులో టౌన్‌ప్లానింగ్ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని టీడీపీ సభ్యులు గండూరి మహేష్, ముప్పా వెంకటేశ్వరరావు, చెన్నుపాటి గాంధీ ఆరోపించారు. రోడ్డు విస్తరణకు ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన స్థలం కంటే ఎక్కువ మొత్తంలో బాండ్లు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. 2,080 గజాల స్థలం ఇస్తే 1,292, 1,321.60 చదరపు గజాల బాండ్లను వేర్వేరుగా ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. ఈ విషయమై తాను సెక్రటరీ సెల్‌కు ప్రశ్న ఇస్తే అది బయటకు ఎలా లీకైందో చెప్పాలని మహేష్ నిలదీశారు. దీనిపై తనకు 16 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. సెక్రటరీ సెల్‌కు ప్రశ్న అందిన రెండు రోజులకు ప్రైవేటు వ్యక్తి వచ్చి తనతో చర్చించారని మేయర్ తెలిపారు. కౌన్సిల్‌కు రాకుండానే ఎలా లీకైందో తేలాలని అధికారుల్ని నిలదీశారు. సెక్రటరీ సెల్, టౌన్‌ప్లానింగ్ అధికారులు తమకేం సంబంధం లేదని భుజాలు తడుముకున్నారు. బాండ్ల మంజూరులో పెద్ద ఎత్తున స్కాం జరిగిందని గాంధీ ఆరోపించారు. సమగ్ర విచారణకు పట్టుబట్టారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేయర్ కమిషనర్‌ను ఆదేశించారు. అధికార పార్టీ సభ్యులే బాండ్లలో స్కాం జరిగిందని ఆరోపణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఫన్‌టైం క్లబ్ మీ డివిజన్‌లోనే ఉంది కాబట్టి లోటుపాట్లన్నీ మీకు (మేయర్) తెలిసే ఉండాలని గాంధీ అనడం చర్చనీయాంశమైంది.

 
సెల్‌టవర్‌లకు అనుమతులపై అధికారులకు చీవాట్లు

సెల్‌టవర్లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టారని మేయర్ అధికారులకు చీవాట్లు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ట్యాంక్‌లపై ఏర్పాటు చేసిన సెల్‌టవర్లను తొలగించాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అధికారుల తీరు వల్ల పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదని డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, టీడీపీ, సీపీఎం సభ్యులు కాకు మల్లికార్జున యాదవ్, ఆదిలక్ష్మి ఆరోపించారు. డివిజన్‌లో రోడ్ల విస్తరణకు సంబంధించి సమాచారాన్ని తెలియజేయకపోవడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్‌సీపీ సభ్యురాలు అవుతు శ్రీశైలజ ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ అధికారులు తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. 279 జీవో వల్ల పారిశుధ్య కార్మికుల ఉపాధికి సంబంధించి ఎలాంటి నష్టం వాటిల్లదని కౌన్సిల్‌లో తీర్మానం చేయాల్సిందిగా ప్రతిపక్షాలు కోరగా మేయర్ తోసిపుచ్చారు. ఐదు నెలల పాటు వారి కాంట్రాక్ట్‌ను పెంచామన్నారు.

 

 

కౌన్సిల్‌లో తీర్మానాలివీ
నగరవాసులకు ఆటవిడుపుగా ఉన్న రాజీవ్‌గాంధీ పార్కును ముక్కలు చేయాలని టీడీపీ పాలకులు నిర్ణయించారు. 38,461.95 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్కులో ఫ్లైవోవర్ నిర్మాణానికి 935.65 చదరపు మీటర్లు, ఏపీ ట్రాన్స్‌కోకు కంట్రోల్ రూం, సబ్‌స్టేషన్ ఏర్పాటుకు 4,573.47 చదరపు మీటర్లు కేటాయించాలని తీర్మానించారు. నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్‌కు సుమారు ఎకరం స్థలం కేటాయించేలా తీర్మానం చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలో అతి పెద్ద పార్క్‌ను ముక్కలు చేయడం సరికాదన్నారు. స్వరాజ్యమైదానం, రైతుబజార్ తరలింపు సరికాదని వైఎస్సార్‌సీపీ, సీపీఎం సభ్యులు వీరమాచినేని లలిత, గాదె ఆదిలక్ష్మి పేర్కొన్నారు. వీటిని యథాస్థానంలో ఉంచేలా తీర్మానం చేయాలని కోరగా మేయర్ ససేమిరా అన్నారు. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి తీర్మానం అవసరం లేదన్నారు.

సత్యనారాయణపురం తాడంకి వారి వీధిలోని 500 చదరపు గజాల స్థలాన్ని సెంటర్ ఇన్‌చార్జి వరల్డ్ స్పిరిట్యువల్ ట్రస్ట్ (బ్రహ్మకుమారీ అనుబంధ   సంస్థ)కు మూడేళ్లు లీజుకు ఇవ్వాలని కౌన్సిల్ తీర్మానించింది. బెంజిసర్కిల్ వద్ద నిర్మాణం చేసే ఫ్లైఓవర్ ప్లానును మార్పు చేసి ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్ వరకు పొడిగించే విధంగా చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అధికారుల్ని కోరుతూ తీర్మానం చేశారు.హనుమాన్‌పేటలోని మునిసిపల్ స్కూల్ ఆవరణలో జూనియన్ కాలేజ్ (ఉర్దూ) నిర్మాణం నిమిత్తం కలెక్టర్ నిర్ణయించిన ధరకు జిల్లా మైనార్టీ శాఖకు కేటాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. కార్పొరేటర్ల గౌరవ వేతనాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని కౌన్సిల్ తీర్మానం చేసింది. టీడీపీ సభ్యుడు కె.వెంకటేశ్వరరావు చేసిన ప్రతిపాదనను సభ ఆమోదించింది. సీపీఎం సభ్యురాలు ఆదిలక్ష్మి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాల పెంపు సరికాదన్నారు. ఈ విషయమై టీడీపీ సభ్యుడు మహేష్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు కార్యకర్తలకు జీతాలు ఇస్తాయని, టీడీపీ మాకేం జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. అందుకే పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచాలని తీర్మానం చేశామని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement