బైక్‌ నడిపితే ఆ కిక్కే వేరు | Bike Riding Special Story | Sakshi
Sakshi News home page

మైలేజీ ముఖ్యమా.. ఫీచర్లు అవసరమా..

Published Fri, Aug 31 2018 12:39 PM | Last Updated on Fri, Aug 31 2018 12:39 PM

Bike Riding Special Story - Sakshi

అదిరిపోయే ఫీచర్లు.. మైమరపించే డిజైన్లు.. ఎన్నెన్నో కొత్త మోడళ్లు.. కిక్‌ కొట్టి బైక్‌ను స్టార్ట్‌ చేసే రోజుల నుంచి  ఆటో స్టార్ట్‌ వరకూ వచ్చేశాం.. ఈ క్రమంలోనే టాప్‌గేర్‌లో ఒక్క రైడ్‌లో దూసుకుపోవాలనే తపన ఎవరికి ఉండదు? కాలేజీలో చేరిన కుర్రకారు నుంచి రిటైర్డ్‌ అయిన సీనియర్‌ సిటిజన్‌ వరకు, ఉద్యోగానికి వెళ్లే మహిళ నుంచి ఇంటిలో ఉండే గృహిణి వరకు.. ఒకే ఒక్కసారి బైక్‌రైడ్‌ చేస్తే బాగుండనిపిస్తుంది. పక్క సందులోని పచారీ కొట్టులో సామాను తేవడం.. స్కూల్‌ నుంచి పిల్లలను తీసుకురావడం కోసమో బండి నడపాలనిపిస్తుంది. ఇవన్నీ చేయాలంటే ముందు సొంతంగా బైక్‌ ఉండాలి. ఏ బైక్‌ కోనాలో ఇక్కడ ఒక లుక్కేద్దాం..

గుంటూరు, తుళ్లూరు:   మధ్య తరగతి ప్రజలకు ఒకప్పుడు బైక్‌ అనేది కల అయితే, నేడు కారు డ్రీమ్‌గా మారిపోయింది. అయినాగానీ పట్టణాల్లో కార్లున్న వారికి బైక్‌లు కూడా తప్పకుండా ఉంటున్నాయి. ఎందుకంటే చిన్న రోడ్లలోనూ బైకులపై దూసుకుపోవచ్చు. పార్కింగ్‌ సమస్య ఉండదు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు కారు, దగ్గర ప్రాంతాలకు వెళ్లేందుకు బైక్‌ వాడకం అనేది ఎక్కువ మంది చేస్తున్న పని. ఏ విధంగా చూసుకున్నా బైకులకు  మన దేశంలో చాలా డిమాండ్‌ ఉంది. అయితే పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే రకం బైకులు, పెద్దలు, యువకులకు, స్త్రీలకు ఒకే రకమైన బైకులు సరిపడవు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బైక్‌ సరిపోలుతుంది.  

తరచుగా వాడతారా?
బైకు కొనాలంటే తక్కువలో తక్కువ రూ.50 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేసే ముందు కీలక విషయాలు తెలుసుకోవడం అవసరం. ఉదాహరణకు ఏ లక్ష్యంలో కొంటున్నారనే దానిపై స్పష్టత ఉండాలి. రోజూ పరిమిత దూరం, మధ్యస్థ దూరం వెళ్లే వారు 125 సీసీ, అంతకంటే ఎక్కువ సీసీ బైకులను తీసుకున్నా పెద్దగా నిర్వహణ భారం ఉండదు. అదే పట్టణంలో ప్రతి రోజూ 50 కిలో మీటర్లకు మించి దూరం ప్రయాణించే వారికి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే బైక్‌ అనువైనది. ప్రతి 2వేలు కిలో మీటర్లకు ఇంజిన్‌ అయిల్‌ మార్చుకోవడం తప్పనిసరి. అదే సమయంలో ప్రతి 4వేలు కిలోమీటర్లకు ఇంజిన్‌ వాల్వ్‌ అడ్జస్ట్‌మెంట్, అవసరమైతే ఎయిర్‌ ఫిల్టర్‌ మార్చుకోవడం.. ఇలా బైక్‌ కండీషన్‌ మంచిగా ఉండాలనుకుంటే కొంత ఖర్చు చేయక తప్పదు. అందుకే ఎక్కువ దూరం ప్రయాణించే వారు నిర్వహణ ఖర్చు తక్కువ ఉన్న వాటిని తీసుకోవడం నయం. అందుకే నిర్వహణ ఖర్చు తక్కువ ఉండాలా? మైలేజీ  కావా లా..? అనేదాన్ని ఎంపిక చేసుకోవాలి.

బైక్‌ – స్కూటర్‌..
బైక్, స్కూటర్‌ ఈ రెండు రకాల వాహనాలపై కూర్చునే విధానం వేర్వేరుగా ఉంటుంది. బైకులను హ్యాండిల్‌ చేయడం స్కూటర్ల కంటే తేలిక. బైకులలో అయితే గేర్లు ఉంటాయి. స్కూటర్లు గేర్‌ లెస్, పైగా వీటిపై కాళ్లు ముందు పెట్లుకోవాల్సి ఉంటుంది. కనుక హ్యాండ్లింగ్‌ విషయంలో బైకులంత సౌకర్యంగా ఉండవు. అయితే స్కూటర్లపై ముందు భాగంలో లగేజ్‌ పెట్టుకునేందుకు, సీటు కింద స్టోరేజీ, హైట్‌ తక్కువగా ఉండడం వల్ల స్త్రీలకు సౌకర్యంగా ఉండటం,  ట్రాఫిక్‌లో తరచూ గేర్లు మార్చడం అసౌకర్యంగా భావించే వారికి, ముఖ్యంగా మహిళలకు స్కూటర్లు అనువుగా ఉంటాయి.  

సీటింగ్‌ పోర్షన్‌..
అదే సమయంలో దూరం ప్రయాణించే వారు సీటింగ్‌ పోర్షన్‌ విషయంపై చాలా శ్రద్ధ పెట్టాలి. మీ బాడీ తీరు, బైక్‌ షేప్‌ ఈ రెండింటీకీ మ్యాచ్‌ అవతున్నాయా, షాక్‌ అబ్జార్బర్స్‌ మంచి శక్తివంతమైనవి ఉన్నాయా అన్నది చూసుకోవాలి. లేకుంటే వెన్నుపూస డిస్కులు దెబ్బతిని భవిష్యత్తులో తీవ్ర సమస్యల బారిప పడతారు. నిజానికి చాలా మంది షాక్‌ అబ్జార్బర్ల అంశాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది సరైనది కాదు.

వాహనం బరువు..
కొనే ముందు బైక్‌ బరువు చూసుకోవాలి. ఎందుకంటే బరువును బట్టే ఆ బైక్‌ను మీరు హ్యాండిల్‌ చేయగలరా..లేదా? అన్న విషయం తెలుస్తుంది. మగవారికైతే బరువు అటూ, ఇటూ అయినా పెద్దగా ఇబ్బంది పడరు. అదే స్త్రీల విషయానికొస్తే వారు ఎక్కువ బరువున్న బైక్‌లను హ్యాండిల్‌ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది.

ట్యాక్స్‌ను తెలుసుకోవాలి..
కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాహన విలువ ఎంత వేశారు, సేల్‌ ట్యాక్స్, జీఎస్‌టీ వంటి వాటిని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి షోరూంలోనూ డీలర్స్‌ విధిగా నోటీస్‌ బోర్డు పెట్టాలి. వాటిని నిశితంగా పరిశీలించి డీలర్స్‌తో చర్చించి ట్యాక్స్‌ విషయంలో అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలి. అంతేకాకుండా టూ వీలర్స్, ఫోర్‌ వీలర్స్‌ వాహనాలకు జీపీఎస్‌ విధానం ఉన్న వాటిని కొనుగోలు చేస్తే వాహన చోదకుడికి భద్రత ఉంటుంది. –వేమూరు బాలకృష్ణ, మోటార్‌ వేహికిల్‌ ఇన్‌చార్జి, మంగళగిరి

మైలేజీ ముఖ్యమా..?
తక్కువ దూరం తిరిగే వారు ఎక్కువ  మైలేజీ వచ్చే బైక్‌లను ఎంపిక చేసుకోవడం సరికాదన్నది నిపుణుల సూచన. ఒక లీటరు పెట్రోల్‌కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనుకోండి. మరో బైక్‌ 50 కిలోమీటర్లు ఇస్తుందనుకుందాం. నెలకు 900 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తికి 40 కిలోమీటర్ల మైలేజీ వచ్చే బైకుకు నెలకు 22.5 లీటర్ల పెట్రోల్‌ ఖర్చు అవుతుంది. అదే 50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బైక్‌కు 18 లీటర్ల పెట్రోల్‌ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ సుమారు రూ.80 ఉంది. ఈ లెక్కన చూస్తే 40 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బైక్‌లకు నెలకు రూ.360 అదనంగా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఈ స్వల్ప మొత్తాన్ని చూడటం కంటే ఇతర ఫీచర్లు ఎందులో బావున్నాయన్నదే చూడాలి.

ఎవరికి.. ఏ బైక్‌?
క్రూయిజర్లు: ఈ బైక్‌లపై కూర్చున్నప్పుడు కాళ్లు ముందుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఛాతీకి సమాంతరంగా, ఛాతికి కంటే ఎత్తులో హ్యాండిల్స్‌ ఉంటాయి.  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ థండర్‌ బర్డ్‌ వంటివి.
స్పోర్ట్స్‌ బైక్స్‌: ఈ బైక్‌లకు హ్యాండిల్‌ బార్‌ ఛాతీ కంటే దిగువ భాగంలో ఉంటాయి. కాళ్లు వెనక్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుకు వంగి బోర్లా పడుకున్న మాదిరిగా బైక్స్‌ను నడపాల్సి ఉంటుంది. చాలా వేగంగా వెళ్లేందుకు, సడెన్‌గా డ్రైవింగ్‌ డైరక్షన్‌ మార్చుకునేందుకు, షార్స్‌ కార్నర్స్‌కు అవి అనుకూలంగా ఉంటాయి. యమహా ఆర్‌15, కవాసకి నింజా 300 బైక్స్‌ వంటివి.
టూరర్‌: వీటిలో కూర్చునే సీట్‌ క్రూయిజర్, స్పోర్ట్‌ బైక్‌ల తీరుకు మధ్యస్థంగా ఉంటుంది. దూర ప్రయాణలు కోరుకునే వారికి అనువైనది. యమహా ఫేజర్, హీరో కరిజ్మా వంటివి.
కమ్యూటర్‌ బైక్స్‌: నిటారుగా కూర్చుని నడిపే బైక్స్‌ ఇవి. స్వల్ప దూరం, ట్రాఫిక్‌లో ప్రయాణాలకు అనువైనవి. 100 సీసీ బైక్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement