=బాలికపై అత్యాచారం?, హత్య
=తల్లడిల్లిన తల్లిదండ్రులు
తవణంపల్లె, న్యూస్‌లైన్: ఆ చిన్నారి ఆరో తరగతి చదువుతోంది. రేగిపండ్ల కోసం ఊరి బయటకు వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండడాన్ని గుర్తించిన దుండగులు కిరాతకంగా ప్రవర్తించి హత మార్చారు. బిడ్డ మరణ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన తవణంపల్లె మండలంలో శనివారం వెలుగు చూసింది. ఎగువ తవణంపల్లె పంచాయతీ మిట్టపల్లెకు చెందిన నరసింహులు, రెడ్డెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె పూర్ణిమ(12) తవణంపల్లె ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.
గురువారం సాయంత్రం తినుబండారాలు కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు, బంధువులు పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఎగువ తవణంపల్లె చెన్నమ్మ చెరువు నీటిగుంటలో పూర్ణిమ మృతదేహం తేలుతుండడాన్ని పశువుల కాపర్లు శనివారం గుర్తించారు. తవణంపల్లె పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, సీఐ శ్రీకాంత్, తవణంపల్లె ఎస్‌ఐ రవీంద్రనాథ్ పరిశీలించారు.
పోలీసులు, వీఆర్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు. దుండగులు బాలిక గొంతుకు గుడ్డతో ఉరేసివున్నారు. అర్ధనగ్నంగా ఉంది. మృతదేహం ఉన్న గుంత నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న రేగిచెట్టు దగ్గర బాలిక చెప్పులు, లంగా(పావడా) పడివున్నాయి. చెరువులోని రేగిచెట్టు పక్కన ప్రతి రోజూ కల్లు విక్రయిస్తుంటారు. జూదం కోసం ఆటగాళ్లు వస్తుంటారు.
సాయంత్రం వేళ రేగిపండ్ల కోసం ఒంటరిగా వచ్చిన బాలిక పట్ల గుర్తు తెలియని వ్యక్తులు కిరాతంగా ప్రవర్తించి హత్య చేసి నీటిగుంటలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్ణిమ మృతితో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. బాలిక మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తవణంపల్లె ఎస్‌ఐ రవీంద్ర నాథ్ తెలియజేశారు.
చిన్నారి జీవితాన్ని చిదిమేశారు..
Published Sun, Jan 5 2014 2:28 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement